అమిత్ షా దళిత భోజనం కథేంటో చెప్పేసిన కేసీఆర్

 అమిత్ షా దళిత భోజనం కథేంటో చెప్పేసిన కేసీఆర్

తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు అనుకోని షాక్ లు తగిలాయి. ముఖ్యంగా తెలంగాణలో దళిత కార్డు ప్రయోగించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను టీఆరెస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదిలోనే ఎండగట్టేశారు. అమిత్ షా దళితవాడల్లో షో చేశారని ఆధారాలతో సహా నిరూపించారు. పాపం... దేశంలో ఇంకెక్కడా తగలనట్లుగా తెలంగాణలో అమిత్ షాకు షాకులు తగిలాయి.

అమిత్ షా మూడు గ్రామాల్లో ద‌ళిత‌వాడ‌ల్లో ప‌ర్య‌టించి.. అక్కడి భోజనం చేసినట్లు నటించారని.. కానీ, అమిత్ షా కోసం దళిత వాడల్లో భోజనం వండలేదని కేసీఆర్ ఆరోపించారు. తెరాట్ పల్లిలో అమిత్ షా భోజనం చేశారని... కానీ, అది పొరుగునే ఉన్న కమ్మగూడెంలో మనోహర్ రెడ్డి అనే నేత వండించి తెచ్చిన అన్నమని ఆయన చెప్పారు.  వేరే గ్రామంలో న‌ల్గొండ అన్న‌పూర్ణ మెస్ నుంచి తీసుకొచ్చార‌ని చెప్పారు. తెరాట్ పల్లిలో దళితులు నిరసన కూడా తెలిపారన్నారు. ఇది తప్పని నిరూపించాలంటూ సవాల్ విసిరారు.

తెలంగాణలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  తెలంగాణకు 20 వేల కోట్ల అదనపు నిధులు ప్రతియేటా ఇస్తున్నామని అమిత్‌ షా చెప్పారని, కనీసం 200 కోట్లయినా ఇచ్చారేమో చూపించాలని సవాలు చేశారు.

2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 50,013 కోట్లు వెళ్తే, కేంద్రం అన్ని విధాలుగా కలిపి తెలంగాణకు ఇచ్చినది కేవలం రూ. 24,561 కోట్లు మాత్రమేనన్నారు. నల్గొండ పర్యటనలో ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని అన్నారు. తెలంగాణ దేశంలోనే సంపన్నమైన రాష్ట్రమని చెప్పారు. ఏ రాష్ట్రం సాధించని లక్ష్యాలను తెలంగాణ సాధించిదని గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే తెలంగాణ అభివృద్ధిని పొగిడారన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు