సీమాంధ్ర ఉద్యమంపై బహుముఖ వ్యూహం

సీమాంధ్ర ఉద్యమంపై బహుముఖ వ్యూహం

సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని అణిచేసి, తెలంగాణను సుసాధ్యం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం బహుముఖ వ్యూహం పన్నినట్లు కనిపిస్తోంది. డెభై రోజులకు పైగా సీమాంధ్రలో ఉద్యమం రగులుతోంది. ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లడానికే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా అధిష్టానానికి సహకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఇలాంటి సమయంలో సమస్యను సర్దుమణిగించి, పరిష్కారం దిశగా పయనించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా యత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒక పక్క ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచిన పార్టీలను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అందుకోసమే తెలంగాణకు మద్దతుగా వున్న తెలుగుదేశం, వైకాపా వ్యవహారాలను పైకి ప్రకటించే ప్రయత్నం ప్రారంభించింది. తెలంగాణ విభజనకు మద్దతుగా ఇచ్చిన లేఖలను బయటపెట్టింది. అదే సమయంలో సీమాంధ్ర సమస్యలు అన్నీ పరిష్కరిస్తామంటూ ప్రకటనలు గుప్పించింది. మరోపక్క తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగలేదని, మరింత వేగంగా వుందని తెలియచేసేందుకు మంత్రుల కమిటీని ప్రకటించింది.

ఇలా ఇటు పార్టీలు, అటు ప్రజలతో మైండ్ గేమ్ ఆడేందుకు కాంగ్రెస్ అధిష్టానం డిసైడైపోయింది. దీనివల్ల వైకాపా, తేదేపా ఆత్మరక్షణలో పడతాయి. కమిటీ ప్రకటించడంతో చేసేదేమీ లేక ఉద్యమ ఉద్యోగులు ఆలోచనలో పడతారు. ప్రజలు మొత్తం మీద నీరస పడతారు. అదీ స్ట్రాటజీ.  అయితే ఈ స్ట్రాటజీ ఇలాగే నడవకుండా వుండాలంటే ఉద్యమం మరింత తీవ్రం కావాలి. బహుశా వైకాపా ఆ దిశగానే అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ దీక్షను ఇవ్వాళ రేపట్లో భగ్నం చేసే అవకాశం వుంది. దాని తరువాత అతగాడు మరోసారి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లడానికి అనుమతించమని కోర్టును కోరచ్చు. కోర్టు అంగీకరించిన పక్షంలో ఉద్యమంలోకి జగన్ దూకితే పరిస్థితి వేరుగా వుంటుంది. దీనిని తట్టకోవాలంటే, చంద్రబాబు ఢిల్లీని వదిలి,ఆత్మగౌరవ యాత్రకు దిగాలి. అది కూడా వెంటనే జరిగితే ఉద్యమానికి మంచిది.కానీ అది ఒకటి రెండు రోజుల్లో సాద్యమయ్యేలా కనిపించడం లేదు.
 
అంటే రాబోయే ఒకటి రెండు రోజులు చాలా క్లిష్టమైనవి. ఉద్యమం నిలబడాలన్నా, ఆగిపోవాలన్నా తేల్చేది ఈ రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో కాంగ్రెస్ మరెన్ని వ్యూహాలు పన్నుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు