1500 మందిని ఇంటికి పంపిన టాటామోటార్స్

1500 మందిని ఇంటికి పంపిన టాటామోటార్స్

భారతీయ వాహనరంగ దిగ్గజం టాటా మోటార్స్ తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ పునర్నిర్మాణంలో భాగం అంటూ ఏకంగా 1500 ఉద్యోగాలకు కత్తెర వేసింది.  తొలగిస్తున్న ఉద్యోగాలన్నీ మేనేజర్‌  స్థాయివి కావడంతో వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.  అయితే... లాభాల్లో క్షీణత ఉందని టాటామోటార్స్ చెబుతున్నప్పటికీ ఆ సంస్థకు చెందిన బ్రిటిష్ విభాగాలు జాగ్వార్, లాండ్ రోవర్లు లాభాల బాటలోనే ఉన్నాయి. ఆ రెండిటి సేల్స్ లో 13 శాతం వృద్ధి... రెవెన్యూలో 10 శాతం వృద్ధి నమోదైంది. అయినప్పటికీ వాటి మాతృ సంస్థ అయిన టాటా మోటార్స్ లాభాలు తగ్గాయంటూ 1500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది.

మేనేజర్ స్థాయి ఉద్యోగులకు సంబంధించి  10-12 శాతం  మందిని తొలగిస్తున్నట్లు సంస్థ  సీఈవో గుంటెర్‌ బుచ్చక్ తాజాగా ప్రకటించడంతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అయితే... వేటు పడేదంతా వైట్ కాలర్ ఉద్యోగులపైనేనని... బ్లూకాలర్‌ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులులేవని  సంస్థ క్లారిటీ ఇవ్వడంతో వారంతా ధీమాగా ఉన్నారు. పనితీరు మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ చెప్తోంది.
  
కాగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న 1500 మందిలో కొందరిని ఐచ్ఛికంగా సంస్థకే చెందిన ఇతర విభాగాలకు బదిలీ చేశారు. మరికొందరు వీఆరెస్ తీసుకున్నారు. అయితే... ఇదంతా నిర్వహణ ఖర్చుల తగ్గింపులో చేపడుతున్నదేమీ కాదని అంటున్నారు.
  
కాగా  2016-17 నాలుగో త్రైమాసిక ఫలితాల్లో టాటా మోటార్స్ బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్ మంచి ఫలితాలు సాధించింది. జనవరి-మార్చిలో దీని నికర లాభం 55.7 కోట్ల పౌండ్లు కాగా  మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది.   టాటా మోటార్స్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన  17 శాతం క్షీణించి రూ. 4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లకు చేరుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు