మోడీ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ పోతుంద‌ట‌

మోడీ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ పోతుంద‌ట‌

వ‌రుస కేసుల‌తో.. వివాదాల‌తో.. ఆరోప‌ణ‌ల‌తో కిందామీదా ప‌డుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తాజాగా అగ్గి మీద గుగ్గులం అయ్యారు. ఆయ‌న‌కు చెందిన 22 ప్రాంతాల్లో ఆదాయ‌ప‌న్ను శాఖాధికారులు దాడులు చేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఫైర్ అవుతున్నారు. ఐటీ అధికారుల దాడుల‌పై వివ‌రాలు అడిగిన మీడియాపై విరుచుకుప‌డిన లాలూ.. 22 చోట్ల సోదాలు అంటున్నారు? అవేంటో మీరే చెప్పండంటూ నిల‌దీశారు.

కేంద్రం మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన లాలూ.. తన‌కు జ్యోతిష్యం బాగా తెలుస‌ని.. త్వ‌ర‌లోనే మోడీ స‌ర్కారు ప‌డిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాటు మోడీ స‌ర్కారు అధికారంలో ఉండ‌ద‌న్న విష‌యాన్ని తాను స్ప‌ష్టంగా చెబుతాన‌న్న ఆయ‌న మోడీ పాల‌న‌పై నిప్పులు చెరిగారు.

ఇటీవ‌ల కాలంలో లాలూ మీదా.. ఆయ‌న కొడుకుల మీదా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నితీశ్ కుమార్ ప్ర‌భుత్వంతో జ‌త క‌ట్టిన లాలూ పార్టీకి ప్ర‌తిఫ‌లంగా ఆయ‌న కుమారుల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం ల‌భించ‌టం తెలిసిందే.  త‌న కుమారులు బ‌ల‌వంతంగా భూమిని లాక్కొని పెద్ద మాల్‌ను నిర్మిస్తున్నారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని తీవ్రంగా ఖండించారు లాలూ.

ఆ భూమిని త‌న కుమారులు కొనుగోలు చేశార‌ని.. దాన్ని అభివృద్ధి చేసిన వారికి యాభై శాతం.. భూమి సొంత‌దారుల‌కు యాభై శాతం వాటా ఉంద‌న్న విష‌యాన్ని చెబుతూ.. చివ‌ర్లో తాము కూడా బ‌త‌కాలి క‌దా? అంటూ చెప్పేసిన మాట కొస‌మెరుపుగా చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయాలు మాత్ర‌మే న‌డిపిన లాలూకు జ్యోతిష్యం మీద ప‌ట్టు ఎప్ప‌టి నుంచి వ‌చ్చింది? నిజంగా జ్యోతిష్య‌మే తెలిసిన‌ప్పుడు.. త‌న మీద ఐటీ దాడులు జ‌రుగుతాయ‌న్న విష‌యం ఆయ‌న‌కు ముందే తెలీదా? ఆరోప‌ణ‌ల‌కు విరుగుడు మొద‌టే క‌నిపెడితే లేనిపోని ఇష్యూలు వ‌చ్చేవి కావు క‌దా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు