'రాజ‌కీయ తాంత్రికుడు' చంద్ర‌స్వామి క‌న్నుమూత‌

'రాజ‌కీయ తాంత్రికుడు' చంద్ర‌స్వామి క‌న్నుమూత‌

ఇప్ప‌టివ‌ర‌కూ కాస్త కొత్త‌గా అనిపించొచ్చు కానీ.. పీవీ న‌ర‌సింహ‌రావు హ‌యాంతో కాస్త ప‌రిచ‌యం ఉన్నా.. చంద్ర‌స్వామి ఇట్టే తెలిసిపోతారు. అధ్యాత్మిక గురువుగా.. వివాదాస్ప‌ద తాంత్రికుడిగా.. రాజ‌కీయాల‌తో స‌హ‌వాసం చేస్తూ.. తెర వెనుక కీల‌క పావులు  క‌దిపే అత్యంత ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తిగా పేరున్న చంద్ర‌స్వామి తాజాగా క‌న్నుమూశారు. దీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ఇటీవ‌ల గుండెపోటు రావ‌టంతో ఆయ‌న అనారోగ్యం మ‌రింత పెరిగింది.

పీవీ న‌ర‌సింహ‌రావుతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లుగా చెప్పే చంద్ర‌స్వామి.. ఆయ‌న ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఒక వెలుగు వెలిగారు. త‌ర‌చూ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తూ.. ప‌లు రాజ‌కీయ నిర్ణ‌యాల వెనుక‌.. ఢిల్లీ స‌ర్కిల్స్ తో ఆయ‌న హ‌వా సాగేది. జాతీయ స్థాయిలో ఆయ‌న ఫేమ‌స్ అయిన ఆయ‌న అస‌లు పేరు నేమిచంద్. జ్యోతిష్యంలో నైపుణ్యం ఉండ‌టం.. ఆయ‌న ఆహార్యం కూడా అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ట్టుకునేది.

కేంద్రంలోని పీవీ స‌ర్కారుతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న ఆయ‌న‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చేవి. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న‌పై ఈడీ కేసులు న‌మోదు చేయ‌టం.. ఫెమా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా నిరూపిత‌మై జ‌రిమానా క‌ట్టాల‌ని సుప్రీం ఆదేశించింది కూడా.

రాజ‌స్థాన్‌కు చెందిన ఆయ‌న తండ్రి హైద‌రాబాద్‌కు వ‌చ్చి వ‌డ్డీ వ్యాపారం చేసే వార‌ని చెప్పేవారు. చంద్ర‌స్వామి శిష్య గ‌ణం జాబితా చెబితే షాక్ తినాల్సిందే. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ అయిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న శిష్య గ‌ణంలో ఉండేవారు. బ్రునై సుల్తాన్‌.. బ్ర‌హ్రైన్ కు చెందిన షేక్ ఇసా బిన్ స‌ల్మాన్ అల్ ఖ‌లీఫా.. న‌టి ఎలిజిబెత్ టేల‌ర్‌.. బ్రిటన్ మాజీ ప‌ర‌ధాని మార్గ‌రెట్ థాచ‌ర్‌.. మాఫియా డాన్ దావూద్ త‌దిత‌రులు ఆయ‌న శిష్య ప‌ర‌మాణువులేన‌ని చెప్పేవారు. చిన్న‌త‌నంలోనే ఇల్లు వ‌దిలి వ‌చ్చేసిన ఆయ‌న‌.. గోపీనాథ్ క‌విరాజ్ వ‌ద్ద తాంత్రిక విద్య‌లు నేర్చుకున్న‌ట్లుగా చెబుతూ.. రాజ‌కీయ నేత‌ల చేత ప‌లు పూజ‌లు చేయించేవార‌ని చెబుతారు. అలాంటి వ్య‌క్తి కాల‌గ‌మ‌నంలో ఛ‌రిష్మా కోల్పోయి.. ఈరోజు ఇలా తుదిశ్వాస విడ‌వ‌టం చూస్తే..కాలం ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు