ఉద్యోగాల క‌ల్ప‌న‌లో హైరింగ్ తక్కువ.. ఫైరింగ్ ఎక్కువ!

ఉద్యోగాల క‌ల్ప‌న‌లో హైరింగ్ తక్కువ.. ఫైరింగ్ ఎక్కువ!

దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెల‌కొన్న ఉడిదుడుకులు ఇంకా చెప్పాలంటే ఉద్యోగాలు ఊడబీక‌డం, కొత్త‌గా త‌క్కువగా ఉద్యోగాలు క‌ల్పించ‌డం అనే ట్రెండ్ కొన‌సాగుతోంద‌ని ప్రముఖ జాబ్‌సైట్ నౌకరీ.కామ్ తేల్చింది. గతనెలలో ఉద్యోగ నియామకాలు వార్షిక ప్రాతిపదికన 24 శాతం తగ్గాయని సర్వేలో వెల్లడైంది. గతనెల జాబ్ మార్కెట్‌లో కొత్త ఉద్యోగాల కల్పన 11 శాతం తగ్గిందని, ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ భారీగా తగ్గడమే ఇందుకు కారణమని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. ఐటీ రంగానికి చెందిన బడా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయంటూ పెద్దఎత్తున ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ రిపోర్టు ఇండస్ట్రీ పరిస్థితులపై మరింత కలవరపెడుతోంది. దీన్నిబట్టి చూస్తే.. సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు కొత్తవారి నియామకాలను కూడా తగ్గించుకుంటున్నాయని అవగతమవుతోంది.


నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రకారం.. నాలుగు అతిపెద్ద మెట్రో నగరాలైన ఢిల్లీ/ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నైలో రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో 28 శాతం, ముంబైలో 18 శాతం, చెన్నైలో 29 శాతం, బెంగళూరులో 28 శాతం, కోల్‌కతాలో 10 శాతం, అహ్మదాబాద్‌లో 19 శాతం తగ్గింది. ఏప్రిల్ 2016తో పోలిస్తే ఈ ఏడాదిలో అదేనెలకు టెలికం, బీపీవో, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. బీపీవో/ఐటీఈఎస్ సెక్టార్లో హైరింగ్ 10 శాతం తగ్గగా.. నిర్మాణ రంగంలో 12 శాతం, బ్యాంకింగ్ సెక్టార్లో 11 శాతం తగ్గిందని సంస్థ వెల్లడించింది. ముందుగా అంచనా వేసినట్లుగానే జాబ్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.

గతనెలలో ఉద్యోగాల కల్పన పదకొండు శాతం తగ్గుదలను నమోదు చేసుకుంది అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ సురేశ్ అన్నారు. ప్రధానంగా ఐటీ, టెలికం, బీపీవో, బీమా, నిర్మాణ రంగాల్లో నియామకాలు భారీగా తగ్గుముఖం పట్టాయని, అన్ని రంగాల్లోనూ యాజమాన్యాలు కొత్త వారిని రిక్రూట్ చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయన్నారు. మరికొన్ని నెలలపాటు మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని సురేశ్ అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండ‌గా....ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్ వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు నికరంగా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని గతవారం నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ ఇటీవ‌లే తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు