టీఆరెస్ లోకి టీడీపీ మాజీ ఎంపీ

టీఆరెస్ లోకి టీడీపీ మాజీ ఎంపీ

తెలంగాణ టీడీపీకి మరో గట్టి షాక్ తగలనుందని తెలుస్తోది. టీటీడీపీ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గులాబీ కండువా కప్పుకోనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడు, మాజీ ఎంపీ అయిన రాథోడ్ రమేష్ ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ద్వారా సీఎం కేసీఆర్ ను కలిశారని సమాచారం. ఈ నెల 29న రాథోడ్ రమేష్ తన కుమారుడు రితీష్, తన వర్గీయులతో కలిసి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.

కాగా, వచ్చే నెలలో రాథోడ్ రమేష్ చిన్న కుమారుడి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను ఆయన ఇటీవలే కలిసి పెళ్లి శుభలేఖ అందజేశారు. పనిలో పనిగా, తాను టీఆర్ఎస్ లో చేరే అంశాన్ని రాథోడ్ రమేష్ ప్రస్తావించినట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న రాథోడ్ రమేష్, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఆదిలాబాద్ ఎంపీగా కూడా ఆయన పని చేశారు.

రమేశ్ భార్య సుమన్ రాథోడ్ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎస్టీ లీడర్ గానే కాకుండా దూకుడు గల నేతగా... పదునైన గళంగా ఆయనకు పేరుంది. అయితే.. కొంత కాలంగా ఆయన యాక్టివ్ గా లేరు. ఎక్కడా ఆయన కనిపించడం లేదు. టీడీపీలో భవిష్యత్తు లేదని అర్థం అయిపోవడంతోనే ఆయన టీఆరెస్ లో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు