పాక్‌కు షాక్ కొట్టింది

పాక్‌కు షాక్ కొట్టింది

అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. గూఢ‌చారి అంటూ భార‌త పౌరుడు కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాక్ విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్టు స్టే విధించింది. త‌మ త‌దుప‌రి ఆదేశాలు వెలువ‌రించేంత వ‌ర‌కు మ‌ర‌ణ‌శిక్ష అమలు చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టంచేసింది. ఈ కేసుపై రెండు రోజుల పాటు విచారించిన అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం... ఇవాళ త‌మ తీర్పును వెలువ‌రించింది.

వియ‌న్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు విచార‌ణ త‌మ ప‌రిధిలో ఉంద‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు స్ప‌ష్టంచేసింది. ఈ విష‌యంలో పాకిస్థాన్ అభ్యంత‌రాల‌ను కోర్టు తోసిపుచ్చింది. కుల్‌భూష‌ణ్ భార‌తీయుడేన‌ని రెండు దేశాలు అంగీక‌రించాయ‌ని జ‌డ్జి రోనీ అబ్ర‌హం అన్నారు. అయితే అత‌ని అరెస్ట్ వివాదాస్ప‌దంగా ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. వియెన్నా ఒప్పందం ప్ర‌కారం జాద‌వ్‌ను క‌లుసుకునే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని రోనీ స్ప‌ష్టంచేశారు. ఈ కేసు విష‌యంలో భార‌త్ వాద‌న‌లు ఆమోద‌యోగ్యంగానే ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కాగా, ఈ కేసులో భార‌త్‌కు ద‌క్కిన గొప్ప విజ‌యం ఇద‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ అన్నారు. తుది తీర్పు కూడా భార‌త్‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. ఈ నిర్ణ‌యంతో పాకిస్థాన్ బిత్త‌ర‌పోయింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు