వ‌న్నాక్రై.. వారి పనేనా?

వ‌న్నాక్రై.. వారి పనేనా?


అణు చెలగాటాలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తరకొరియా సైబర్‌దాడులకూ సై అంటున్నదా? వ‌ంద‌కు పైగా దేశాలను వణికిస్తున్న న్నాక్రై సైబర్ మహమ్మారి ఉత్తరకొరియా పనేనా? అంటే ఔననే అంటున్నారు నిపుణులు. ఉత్తరకొరియా హస్తం ఉన్నట్టు రుజువు చేసే కోడ్‌ను భారత సంతతికి చెందిన గూగుల్ టెకీ నీల్ మెహతా వెలికితీశారు. కీలకమైన కోడ్ బయటపెట్టారంటూ రష్యా సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ ప్రశంసించింది. వన్నాక్రై ప్రబావం భారత్‌పై అంతంతమాత్రమేనని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది.

గత శుక్రవారం 150 దేశాల్లో రెండు లక్షల కంప్యూటర్లపై వన్నాక్రై రాన్‌సమ్‌వేర్ దాడిచేసి ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. డిజిటల్ యుగంలో అతిపెద్దదిగా భావిస్తున్న సైబర్‌దాడికి ఉపయోగించిన కోడ్‌లో ఉత్తరకొరియా ముద్రలు కనిపిస్తున్నాయి. 2014లో సోనీపిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ డేటాబేస్ హ్యాక్ చేసేందుకు, గత ఏడాది బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసేందుకు ఉపయోగించిన కోడ్‌కు వన్నాక్రై కోడ్‌కు దగ్గరిపోలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సైబర్‌దాడులు జరుగొచ్చని దక్షిణకొరియా సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, నీల్ మెహతా కనిపెట్టిన కోడ్, అందులోని ఇతర టూల్స్ లాజరస్ గ్రూప్ సృష్టించిన సాఫ్ట్‌వేర్‌కు దగ్గరగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నట్టు బీబీసీ వార్తాసంస్థ తెలిపింది. తాజాగా నీల్ బయటపెట్టిన కోడ్ ఉత్తరకొరియా జోక్యాన్ని నిర్దంద్వంగా రుజువు చేయనప్పటికీ దీనిపై పరిశోధన చేయాల్సిన అవసరమని ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ అలెన్ వుడ్‌వర్డ్ అభిప్రాయపడ్డారు. వన్నాక్రై మూలాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన కోడ్‌లలో నీల్ మెహతా కనిపెట్టిందే అత్యంత కీలకమైందని రష్యా సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ కితాబు ఇచ్చినప్పటికీ మరింతగా పరిశోధన జరుగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

లాజరస్ గ్రూప్ ఉత్తరకొరియాకు చెందిందని అమెరికా భావిస్తున్నప్పటికీ తెలివైన హ్యాకర్లు అలాంటి భ్రమను కలిగించే అవకాశం లేకపోలేదనే వాదనలూ ఉన్నాయి. సోనీ పిక్చర్స్‌పై జరిగిన దాడిలో ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్‌ను ఎద్దేవా చేస్తూ తీసిన ది ఇంటర్వ్యూ సినిమా విడుదలను అడ్డుకోవడం లక్ష్యం. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా జరిగిన వన్నాక్రై సైబర్‌దాడిలో ఉత్తరకొరియా మిత్రదేశమైన చైనా కూడా బాధితదేశం కావడం ఆలోచించాల్సిన విషయమని సైబర్‌నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ఒకవేళ డబ్బులు గుంజడమే లక్ష్యమైతే ఆ విషయంలోనూ హ్యాకర్లు పెద్దగా విజయవంతం కాలేదనే భావించాలి. ఇప్పటివరకూ బిట్‌కాయిన్ రూపంలో జరిగిన వసూళ్లు 60 వేల డాలర్లు మించలేదని అంటున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు తాజా సైబర్‌దాడితో అతలాకుతలమయ్యాయి.

కాగా, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ మీద చైనాకున్న వ్యామోహమే గ్లోబల్ సైబర్ దాడులకు ద్వారాలు తెరిచిందని నిపుణులు అంటున్నారు. చైనాలోని 70 శాతం కంప్యూటర్లు పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ మీదనే నడుస్తాయి. ఈ ధోరణికి చెక్‌పెట్టాలని వచ్చిన సూచనలను చైనా పెద్దగా పట్టించుకోలేదు. అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీల్లోనూ 18-22 శాతం సాఫ్ట్‌వేర్లు పైరసీవే. చైనాలోని 66 యూనివర్సిటీలు సైబర్‌దాడికి గురైనట్టు చైనా అంగీకరించింది. అమెరికాలోమాత్రం సైబర్‌దాడుల ప్రభావం అంతగా లేదని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. మ‌రోవైపు వన్నాక్రై సైబర్‌దాడి ప్రభావం భారత్‌పై అంతంత మాత్రమేనని కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అరుణాసుందర్‌రాజన్ తెలిపారు. ఐదారు ఘటనలు మినహా ఎక్కువగా కంప్యూటర్లు దెబ్బతిన్న దాఖలాలు లేవని మంగళవారం మీడియాకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన 18 కంప్యూటర్లు, కేరళలోని కొన్ని పంచాయితీల కంప్యూటర్లు వన్నాక్రై సైబర్ దాడికి గురయ్యాయని ఆమె వివరించారు. ``ప్రభుత్వం గత మార్చి నుంచే అప్రమత్తంగా ఉంది. కీలకమైన నెట్‌వర్క్‌లకు రక్షణ వలయాలు కల్పించాం. ఇంతవరకైతే భారీఎత్తున వైరస్ సోకినట్టు ఎలాంటి సమాచారం రాలేదు`` అని ఐటీశాఖ కార్యదర్శి చెప్పారు. కేరళలోని పాలక్కాడ్‌లోగల రైల్వే డివిజనల్ ఆఫీసులోని కొన్ని కంప్యూటర్లకు వైరస్ సోకినట్టు వార్తలు వెలువడ్డాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు