వెంకీతో ఆ లెజెండ్ పేరు వినిపిస్తోందే..

వెంకీతో ఆ లెజెండ్ పేరు వినిపిస్తోందే..

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘గురు’ విడుదలై నెలన్నరే అవుతోంది. ఐతే ఆ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు ఆరు నెలలవుతోంది. అప్పట్నుంచి హీరో వెంకటేష్ ఖాళీగానే ఉన్నాడు. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఆయన ఈ ఏడాది ఆరంభంలోనే ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాను మొదలుపెట్టాల్సింది. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా కోసం వెంకీ చర్చలు జరిపాడు. అది ఆల్మోస్ట్ ఓకే అయినట్లే అయి.. పక్కకు వెళ్లిపోయింది. దీంతో వెంకీ కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉండాల్సి వస్తోంది.

ఇటీవలే ‘జాలీ ఎల్ఎల్‌బీ-2’ రీమేక్ కోసం వెంకీ పేరు వినిపించింది కానీ.. అది పవన్ కళ్యాణ్ చేస్తాడంటున్నారు. మరి వెంకీ తర్వాత ఏ దర్శకుడితో పని చేయబోతున్నాడు.. ఎలాంటి సినిమా చేయనున్నాడు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. విక్టరీ హీరో మలయాళ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో పని చేసే అవకాశాలున్నట్లుగా సమాచారం అందుతోంది.

దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి దర్శకుడిగా కొనసాగుతున్న ప్రియదర్శన్.. 90కి పైగా సినిమాలు చేశారు. ఐతే ఇప్పటికీ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. పోయినేడాది కూడా మలయాళంలో ‘ఒప్పం’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆయన వెంకీ కోసం ఓ స్పెషల్ స్టోరీ రెడీ చేస్తున్నారట.

ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. గతంలో నాగార్జునతో ‘నిర్ణయం’, బాలకృష్ణతో ‘గాంఢీవం’ చేశాడు. ఆ సినిమాలు ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చాయి. మరి ఇప్పుడు వెంకీతో ఆయన సినిమా ఓకే అయితే అది ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహాల్లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు