6 ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగాలు ఫ‌ట్‌?

6 ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగాలు ఫ‌ట్‌?

ఐటీ రంగంలోని తీవ్ర ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల కార‌ణంగా దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఐటీ సంస్థల్లోని చాలా విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతూ వస్తున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్ టెక్నాలజీల సాయంతో చాలా వరకు కార్యకలపాలను ఆటోమేట్ చేయడం ఇందుకు కారణం. ఇందుకుతోడు హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అమెరికాలో కార్యకలాపాలకు స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దేశీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల చొప్పున ఉద్యోగులను తొలిగించవచ్చని హెడ్ హంటర్స్ అనే సంస్థ అంచనా వేస్తోంది. కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ అధికారులను నియమించుకోవడంలో తోడ్పడే ఈ సంస్థ ప్రకారం.. మూడేళ్ల‌ వరకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.

ఈ ఏడాదిలో ఐటీ రంగంలో 56 వేల మంది సిబ్బందిపై వేటు పడవచ్చని గతవారం ఓ నివేదిక అంచనా వేసింది. అయితే ఉద్యోగాల కోత అంతకంటే మూడు రెట్లు అధికంగా ఉండవచ్చని, సమకాలీన సాంకేతికతకు అనుగుణంగా కార్యకలాపాలను సిద్ధం చేసుకోవడంలో సంస్థలు వెనుకబడటం ఇందుకు కారణమని హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాక చైర్మన్, ఎండీ కే లక్ష్మీకాంత్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో మెకిన్సే అండ్ కంపెనీ సమర్పించిన నివేదికను విశ్లేషిస్తూ లక్ష్మీకాంత్ తన వాదనను బలపర్చారు. వచ్చే 3-4 ఏళ్ల‌లో ఐటీ రంగంలో పనిచేస్తున్న సగం మంది సిబ్బంది అవసరం లేకుండా పోతుందని మెకిన్సే రిపోర్టు పేర్కొంది.  

ప్రస్తుతం దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తక్కువ నియామకాలు, ఎక్కువ తొలగింపులు మంత్రాన్ని జపిస్తున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. త్వరలోనే 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు వార్తలొచ్చాయి. పనితీరు సంతృప్తికరంగా లేని సీనియర్, మధ్య స్థాయి సిబ్బందిపై సంస్థ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ కూడా త్వరలో 9,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించనుందంటూ కథనాలు వచ్చాయి. అమెరికన్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్‌లు ఇంకా ఇతర ఉన్నతోద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ లాంటి ప్యాకేజీని ప్రకటించింది. కనీసం వెయ్యి మంది ఉన్నతోద్యోగులు ఈ కార్యక్రమం ద్వారా సంస్థను వీడవచ్చని కాగ్నిజెంట్ భావిస్తోంది. మొత్తంగా సంస్థ 6 వేల మందికి ఉద్వాసన పలుకవచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో చెన్నైలోని కాగ్నిజెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు లేబర్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఇంతక్రితం విప్రో కూడా 600 మందిని ఉద్యోగం నుంచి తీసివేసినట్లు తెలిపింది. త్వరలో ఈ సంఖ్య 2వేలకు చేరుకోవచ్చని అంచనా. ప్రస్తుతం 39 లక్షల మంది పనిచేస్తున్న ఐటీ ఇండస్ట్రీలో 50-60 శాతం మందికి ఆధునిక సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, కంపెనీలకిది అతిపెద్ద సవాలు కానుందని నివేదికలో మెకిన్సే ఇండియా ఎండీ నోషిర్ కాక అభిప్రాయపడ్డారు.

``మెకిన్సే రిపోర్టును బట్టి చూస్తే, ఐటీ రంగంలో వచ్చే మూడేండ్లలో 5-6 లక్షల మంది ఉద్యోగుల అవసరం లేకుండా పోతుందని అవగతమవుతోంది. అంటే, సరాసరిగా ఏడాదికి లక్షా డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. అయితే, ప్రధాన నగరాల్లోని కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోని బ్రాంచ్‌లలో కోతలు అధికంగా ఉండవచ్చు``అని లక్ష్మీకాంత్ అన్నారు. ``ఈ పరిణామం 35 ఏళ్ల‌కు పైబడిన సిబ్బందిపై అధిక ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే, మళ్లీ వారికి కొత్త ఉద్యోగం సంపాదించడం కష్టసాధ్యం కావచ్చు. ప్రస్తుతం ఐటీ రంగం అత్యంత అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతోంది. ఇండస్ట్రీలో క్లౌడ్ ఆధారిత సేవల వంటి డిజిటల్ టెక్నాలజీలు ముందుగా అంచనా వేసినదానికంటే శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి.దీంతో ఐటీ సంస్థలు ఆధునిక సాంకేతికతలను వాడుకలోకి తేవడంతోపాటు ఉద్యోగులకు వాటిపై శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది`` అని విశ్లేషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు