ఎవ‌రికీ అర్థం కాని ర‌జ‌నీ రాజ‌కీయం

ఎవ‌రికీ అర్థం కాని ర‌జ‌నీ రాజ‌కీయం

త‌మిళ రాజ‌కీయాల్లో ఏర్ప‌డిన శూన్య‌త‌ను భ‌ర్తీ చేస్తార‌ని భావిస్తున్న ర‌జ‌నీకాంత్ త‌న మ‌న‌సులో ఏముందో ఇప్ప‌టికీ స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. అభిమానుల‌తో స‌మావేశ‌మ‌వుతున్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ ప్ర‌స్తావ‌న చేస్తున్నా కూడా త‌న మ‌న‌సులో మాట మాత్రం బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని, రేపు దేవుడు తనకు ఏం పని అప్పగిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ త‌న‌కు అల‌వాటైన వేదాంతం మాట్లాడుతుండ‌డంతో అభిమానులు త‌ల‌లుప‌ట్టుకుంటున్నారు.

రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పిన ఆయన, తప్పుడు వ్యక్తులను దూరంగా ఉంటానని అన్నారు. తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే పదివేలని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పలువురు తమిళ ప్రజలతో పాటు, అభిమానులతో చర్చించిన తరువాతనే శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలిపారు.

మ‌రోవైపు ఎంపిక చేసిన అభిమాన సంఘాల నాయకులతో తలైవా రజనీకాంత్ సమావేశం ఉత్సాహంగా సాగుతోంది. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన రజనీ, తనపై చూపిస్తున్న ఇంతటి ఆదరణను జీవితాంతమూ మరచిపోబోనని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలం నుంచి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, వారు అలా కోరడంలో తప్పులేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్నవారిని దగ్గర చేర్చుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు.  తాను ఎవరికీ భయపడేది లేదని అన్నారు. భయం అన్నది తనలో, తన అభిమానుల్లో ఏ మాత్రం కనిపించదని చెప్పారు. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన చెప్పకపోయినా, రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదల‌వ‌డంతో అన్నీ ఆలోచించుకుని నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు