తెలంగాణ‌కు ల‌క్ష్మీనారాయ‌ణ‌...హైద‌రాబాద్ సీపీగా చాన్స్‌!

తెలంగాణ‌కు ల‌క్ష్మీనారాయ‌ణ‌...హైద‌రాబాద్ సీపీగా చాన్స్‌!

మహారాష్ట్ర అదనపు డీజీ, సీబీఐ హైదరాబాద్‌ మాజీ చీఫ్‌ అయిన లక్ష్మీ నారాయణ తెలంగాణ కేడ‌ర్‌కు రానున్నారా? త్వ‌ర‌లో హైద‌రాబాద్ సీపీగా ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోనున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు తాజా సమావేశం ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను ల‌క్ష్మీనారాయ‌ణ కలిశారు. ఆయనతో కలిసిన అనంత‌రం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగా డీజీపీని కలిశానని తెలిపారు.

అయితే మహారాష్ట్ర ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్త‌లు వెలువడుతున్నాయి. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన లక్ష్మీనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ అక్రమాస్తుల ఆరోప‌ణ‌ కేసుపై సీబీఐ డీఐజీగా దర్యాప్తును హైదరాబాద్‌లో ఉండి పర్యవేక్షించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన సొంత కేడర్‌ రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లిపోయారు. ఆయనకు మరో ఎనిమిదేళ్ల‌ పాటు సర్వీసు ఉంది. అయితే  తెలంగాణాలో డిప్యూటేషన్‌పై కొనసాగాలని ఆయన ఆకాంక్షగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేంద్ర హోంశాఖతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద తన అభిమతాన్ని ఆయన తెలియచేసినట్టు స‌మాచారం.

క్షేత్ర‌స్థాయిలో కూడా అనుకూల‌త‌ను పెంచుకోవ‌డంలో భాగంగా రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను కలిసి తన ఆసక్తి గురించి వివరించినట్టుగా సమాచారం. అందుకు ఆయన కూడా లక్ష్మీనారాయణకు వెల్‌ కమ్‌ చెప్పినట్టు తెలిసింది. ఒక వేళ ఆయన డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన పక్షంలో ప్ర‌స్తుతం న‌గ‌ర క‌మిష‌న‌ర్‌గా ఉన్న మహేందర్‌రెడ్డి తర్వాత హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా లక్ష్మీనారాయణను నియమించే అవకాశాలు లేకపోలేదని ఐపీఎస్‌ వర్గాలలో చ‌ర్చ సాగుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో అనురాగ్‌శర్మ రిటైర్‌ అయ్యాక రాష్ట్ర డీజీపీ పగ్గాలు మహేందర్‌రెడ్డికి దక్కనున్నాయని, ఆయన స్థానంలో కమిషనర్‌గా లక్ష్మీ నారాయణ నియమితులవుతారని అంచ‌నా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు