ఆంధ్రా టు అమెరికా..7 రోజులు...15 సిటీలు

ఆంధ్రా టు అమెరికా..7 రోజులు...15 సిటీలు

7 రోజులు...15 సిటీలు.. బ‌య‌లుదేరింది మొద‌లు తిరిగి వ‌చ్చే వ‌ర‌కు ఫుల్ బిజీ షెడ్యూల్‌. బ‌డా కంపెనీల‌తో స‌మావేశాలు...రాష్ర్టానికి పెట్టుబ‌డులు.. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్విజయంగా ముగించుకొని వ‌చ్చిన అమెరికా పర్యటన విశేషాలు. వారం రోజుల అగ్ర‌రాజ్య ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఫుల్ బిజీ షెడ్యూల్‌తో గ‌డిపారు. అమెరికా వెళ్లే ముందు, తిరిగొచ్చే సమయంలోనూ దేశ రాజధాని ఢిల్లీ మీదుగానే ఆయన ప్రయాణం సాగించారు.

పెట్టుబ‌డుల సాధ‌నే ల‌క్ష్యంగా సాగిన చంద్ర‌బాబు అమెరికా షెడ్యూల్ ఇలా ఉంది. ఈనెల 3వ తారీఖున ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్ర‌బాబు పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మరుస‌టి రోజు 4వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలో బయల్దేరిన చంద్ర‌బాబు కాలిఫోర్నియాలో అడుగుపెట్టారు. మే 4 నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు జరిగిన అమెరికా పర్యటనలో ఆయన మొత్తం 15 నగరాలు పర్యటించారు. అమెరికాలోనే 7000 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. 30కి పైగా సమావేశాల్లో పాల్గొని, 90కి పైగా సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొత్తం 12,500 ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగింది. కేవలం ఐటీ, హార్డ్‌ వేర్‌, ఇంటర్నెట్‌ రంగాల్లోనే కాకుండా వ్యవసాయం, ఆటోమోటివ్‌, హెల్త్‌ కేర్‌, ఫిన్‌ టెక్‌ రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన సంప్రదింపులు జరిపారు.

పర్యటన మొత్తంలో ఆపిల్‌ సంస్థ అధినేతలతో జరిగిన సమావేశం కీల‌కం. అప్లైడ్‌ మెటీరియల్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సిస్కో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జాన్‌ ఛాంబర్స్‌తో భేటీ అయిన సీఎం, చిన్న తరహా పరిశ్రమల్ని మరింత సరళతరం చేయడంలో సాంకేతిక సహాయం అందించాలని కోరారు. అమెరికాలో స్థిరపడ్డ ఇండో-అమెరికన్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ వినోద్‌ ఖోస్లాతో సమావేశమై, పెట్టుబడులకు, పరిశ్రమలకు తామిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలపై వివరించారు. మరోవైపు అమెరికాలోని లోవా రాష్ట్రంతో వ్యవసాయ రంగంలో సహకారంపై అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. విత్తన ఉత్పత్తి, అధిక దిగుబడులనిచ్చే విత్తనాల కోసం పరిశోధనలు, రైతులకు ప్రయోజనం కల్గించే వ్యవసాయ చర్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి సహకరించనుంది.

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కార‌ణంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, అమరావతి నగరాల్లో ఉద్యోగావకాశాలు పెంపొందించే క్రమంలో 28 కంపెనీలు ముందుకొచ్చే అవకాశముంది. యూనివర్సిటీ ఆఫ్‌ సిలికానాంధ్ర సీఈఓతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఇన్నోవా సొల్యూషన్స్‌, ఐ బ్రిడ్జ్‌ ఇంక్‌, ఈవీఎక్స్‌ సొల్యూషన్స్‌ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చున్న సీఎం చంద్రబాబు, 12,000 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. క్వాల్‌ కాం కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న గోపి సిరినేనితో జరిగిన భేటీలో ఏపీలో తలపెట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు గురించి వివరించిన చంద్ర‌బాబు, సహకారం కోరారు. ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి డ్రైవర్‌ అవసరం లేని కార్లు తయారు చేస్తున్న వేమో సంస్థ గురించి తెలుసుకున్నారు. ప్లెక్స్‌ ట్రానిక్స్‌ సీఈఓ మైక్‌ మెక్‌ నమారాతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ లో విస్తరణ అవకాశాల గురించి వివరించారు. అమరావతిని గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా తీర్చిదిద్దడంలో కాలిఫోర్నియా గవర్నర్‌ సహాయం కోరారు. ఇలా బిజీ బిజీగా 7 రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు, తిరుగు ప్రయాణంలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు పెట్టుకోలేదు. పర్యటనలో భాగంగా అమెరికాలోని రోషెష్టర్‌ నగరంలో మాయో క్లినిక్‌లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ను పరామర్శించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు