మాగంటి బాబుగారు మారిపోయారు తెలుసా?

మాగంటి బాబుగారు మారిపోయారు తెలుసా?

 తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఎంతో మారిపోయారు తెలుసా! అవును నిజం. సాక్షాత్తు పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పోలవరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకు దూరంగా ఉండ‌ట‌మే కాకుండా పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ క‌డిగేసిన బాబు..ఇప్పుడు ట్యూన్ మార్చేశారు. తాను ఎంత‌గానో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. త‌న క‌ష్టం గుర్తించిన సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసిస్తున్నార‌ని చెప్పుకున్నారు. అంతేకాదు అంద‌రు చంద్ర‌బాబుతో క‌లిసి రావాల‌ని అన్నారు. దీంతోపాటుగా మ‌రెన్నో మంచి విష‌యాల‌ను మాగంటి బాబు సెల‌విచ్చారు.


పోలవరంలో ఇటీవల జరిగిన శంకుస్థాపన సమయంలో శిలాఫలకంపై తన పేరును 12వ స్థానంలో ఉంచారని, పార్లమెంటుసభ్యునిగా తన పేరుకు ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల కొంత అసంతృప్తికి లోనైన విషయం నిజమేనని మాగంటి  బాబు అంగీక‌రించారు. అయితే తదనంతర పరిస్థితుల్లో ఏలూరు పార్లమెంటునియోజకవర్గ పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా శంకుస్థాపన, ఫ్రారంభోత్సవ శిలాఫలకాలపై ఒకే మాదిరిగా అన్ని చోట్లా శిలా ఫలకాలు ఏర్పాటుచేసేందుకు ఎమ్మెల్యేలు, తాను నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో ప్రతీ ఒక్కరూ కొన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, తాత్కాలిక రాజధానిని కూడా అందరూ గర్వపడేలా తీర్చిదిద్దారని, శాశ్వత రాజధాని నిర్మాణానికి బాటలువేస్తున్నార‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

పదవులు ఆశించడం తప్పుకాదని, ఇప్పుడు అవకాశం రాకపోతే మరొక విధంగా ప్రాధాన్యత లభించవచ్చునని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అందరు ఎమ్మెల్యేలు తనతో సఖ్యతగానే వుంటున్నారని, వారందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు మాగంటి చెప్పుకొచ్చారు. తాను మరికొంతమంది ఎంపీలు ఇటీవల దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించామని, ఈసందర్భంగా సైనికులు దేశం కోసం చేస్తున్న త్యాగాలనుచూసి కళ్లు చెమర్చాయని మాగంటి బాబు చెప్పారు. రెప్ప మూయకుండా అహర్నిశలు దేశాన్ని రక్షించేందుకు సైనికులు పడుతున్న తపనను ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని, వారి సంక్షేమం కోసం ప్రతీ ఒక్కరూ తమ వంతుసహకారాన్ని అందించేందుకు ముందుకు రావాలని మాగంటి బాబు పిలుపునిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు