టీటీడీ ఛైర్మన్ పదవికి ఫుల్ గిరాకీ

టీటీడీ ఛైర్మన్ పదవికి ఫుల్ గిరాకీ

టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ అధికారిని నియమించి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో చైర్మన్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటున్నారట.  ఆయన అమెరికా నుంచి వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

చైర్మన్‌ పదవిని అధికార పార్టీకి చెందిన ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, మురళీమోహన్‌ ఆశిస్తున్నా చంద్రబాబు మాత్రం ఎంపీలకు ఈ పదవిని కట్టబెట్టరాదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

మంత్రి పదవి పోవడంతో చంద్రబాబు పై అలకబూనిన గోపాలకృష్ణారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవికి ఎంపికచేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చంద్రబాబు పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో ఇప్పటికే అన్నారట.  మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడికి అవకాశం దక్కకపోవడంతో కనీసం తిరుమల తిరు పతి దేవస్థానం చైర్మన్‌ పదవిలోనైనా తనను నియ మించాలని ఆయన కోరుతున్నట్టు చెబుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని చివరిదాకా ఆశలు పెట్టుకున్న కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో బీసీలో కోటాలో తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మంత్రి పదవి రాకపోవడంతో మిగతా నేతల మాదిరిగానే వెంకట్రావు కూడా అలక బూని కొన్ని రోజులపాటు అధినేత చంద్రబాబును కలవలేదు.

కాగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితు డు డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ అప్పట్లోనే ఆయనను కలిసి తాను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నానని ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కోరినట్లు చెబుతుంటారు.. అయితే, ఈ పదవికి సంబంధించి ఇప్పటికే తాను చదలవాడకు హామీ ఇచ్చానని ఆయన పదవీకాలం పూర్తయ్యాక పేరును పరిశీలిస్తానని అప్పట్లో చంద్రబాబు లక్ష్మీనారాయణ కు అప్పట్లో చెప్పారట.  ప్రస్తుతం చదలవాడ పదవీకాలం పూర్తి కావడంతో ఆ పదవిలో తనను నియమించాలని లక్ష్మీనారాయణ చంద్రబాబును కలిసి అభ్యర్థించారు. అమెరికా పర్యటన ముగించు కుని వచ్చాక తాను ఈ పదవికి సంబంధించిన కసరత్తును ప్రారంభిస్తానని అప్పటిదాకా వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం.

మరోవైపు  ఎంపీలలో రాయపాటి, మురళీమోహన్‌తో పాటు జేసీ దివాకర్‌రెడ్డి సైతం పోటీ పడుతున్నట్టు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇటీవలె వైకాపా నుంచి తెదేపాలో చేరిన తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, భాజపా నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు కూడా తితిదే చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారి జాబితాలో చేరారు. నర్సారాపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు దేవస్థానం చైర్మన్‌ పదవిని ఇస్తే అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా.
మరోవైపు పదవి విరమణ చేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఈ దఫా ఈ పదవిని కోస్తా జిల్లాల వారికి కేటాయించాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు