ఏపీకి డెల్ ఓకేన‌ట‌!

ఏపీకి డెల్ ఓకేన‌ట‌!

తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు య‌మా జోరుగా ప‌లు బ‌డా కంపెనీల ప్ర‌త‌నిధుల‌తో భేటీ కావ‌టం తెలిసిందే. గూగుల్‌.. యాపిల్‌.. డెల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ప‌లు కంపెనీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌వుతూ.. ఏపీలో ఉన్న వ్యాపార అవ‌కాశాల్ని వెల్ల‌డిస్తూ.. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాలంటూ కోరుతున్న విష‌యం తెలిసిందే.

ఈ భేటీల్లో యాపిల్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో బాబు జ‌రిపిన స‌మావేశం ఫ‌ల‌ప్ర‌దం అయిన‌ట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా తిరుప‌తి వ‌ద్ద యాపిల్ త‌న త‌యారీ విభాగాన్ని ఏర్పాటు చేయ‌టానికి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టికే ఏపీకి వ‌చ్చిన యాపిల్ ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ కావ‌ట‌మే కాదు.. ప్లాంటును ఏర్పాటు చేయ‌టానికి అనువుగా ఉన్న ప్రాంతాల్ని ప‌రిశీలించారు.

త‌న తాజా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఈ ప్లాంటుకు సంబంధించి ప్ర‌భుత్వం త‌ర‌ఫున క‌ల్పించే వ‌స‌తుల గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చిన చంద్ర‌బాబు.. యాపిల్ ప్ర‌తినిధుల్ని ఏపీకి రావాల్సిందిగా కోరారు. దీనిపై యాపిల్ తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల త‌యారీ సంస్థ డెల్‌.. ఏపీలో త‌మ డేటా సెంట‌ర్ను ఏర్పాటు చేసేందుకు అంగీక‌రించింది. తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఇందుకు సంబంధించిన ఒక ఒప్పందాన్ని చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

డెల్ కంపెనీతో ఒప్పందం అనంత‌రం.. భెల్ హెలికాఫ్ట‌ర్ డైరెక్ట‌ర్ చాద్ స్ప‌ర్క్ తో స‌మావేశ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. పెట్టుబ‌డిదారుల‌కు త‌మ రాష్ట్రం క‌ల్పిస్తున్న వ‌స‌తుల గురించి వివ‌రించిన చంద్ర‌బాబు.. 75 మిలియ‌న్ డాల‌ర్ల‌కు మించి పెట్టుబ‌డులు పెట్ట‌టానికి టైల‌ర్ మేడ్ పాల‌సీ తీసుకురానున్న‌ట్లుగా వెల్ల‌డించారు. రాష్ట్రానికి వ‌చ్చి అధికారుల‌తో మాట్లాడాల‌ని చంద్ర‌బాబు కోరారు. భెల్ ప్ర‌తినిధుల‌తో భేటీ అనంత‌రం దాదాపుగా 28 కంపెనీల‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో కీల‌క భేటీలు నిర్వ‌హించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రీ భేటీల‌న్నీ వార్త‌ల వ‌ర‌కేనా?
నిజంగానే ఏపీకి పెట్టుబ‌డులు పెట్టేదిశ‌గా అడుగులు వేస్తాయా? అన్న‌ది కాల‌మే స‌రైన స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌ద‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు