ఛేజ్ చేసి మ‌రీ భ‌ర్త‌పై తుపాకీ కాల్పులు

ఛేజ్ చేసి మ‌రీ భ‌ర్త‌పై తుపాకీ కాల్పులు

ఈ ఉదంతం గురించి వింటే అస్స‌లు న‌మ్మ‌బుద్ధి కాదు. నిజంగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న విన్న‌వారంతా షాక్‌కు గురి అవుతున్నారు. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య దెబ్బ‌లాట‌లు మామూలే. కానీ.. శ్రుతిమించి రాగాన ప‌డిన వీరి వ్య‌వ‌హారం తుపాకీ కాల్పుల వ‌ర‌కూ వెళ్ల‌ట‌మే కాదు.. సినిమాల్లో చూపిన‌ట్లుగా సాగిన వైనం సంచ‌ల‌నంగా మారింది. క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు శివారుల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..

53 ఏళ్ల సాయిరాం.. 48 ఏళ్ల హంస‌లు దంప‌తులు. ఎప్పుడో ఇర‌వై ఏళ్ల క్రితం వారికి పెళ్లి అయ్యింది. ఈ మ‌ధ్య అప్పుడ‌ప్పుడూ గొడ‌వ ప‌డుతుంటారు. తాజాగా త‌మిళ‌నాడులోని హోసూరుకు వెళ్లిన వారిద్ద‌రూ కారులో ప్ర‌యాణిస్తున్నారు. ప్ర‌యాణంలో భాగంగా మార్గ‌మ‌ధ్యంలో కారు ఆపి దాబాలో భోజ‌నం చేశారు. ఆ త‌ర్వాత మ‌ద్యం సేవించారు.

ప్ర‌యాణంలో ఇరువురి మ‌ధ్య మాటామాటా పెరిగింది. అది కాసేప‌ట్లోనే పెరిగి పెద్ద‌దైంది. గొడ‌వ నేప‌థ్యంలో తీవ్ర ఆగ్ర‌హంతో భార్యపై చేయి చేసుకున్నాడు భ‌ర్త‌. రెచ్చిపోయిన ఆమె కారులోని తుపాకీని తీసి.. భ‌ర్త‌పై కాల్పులు జ‌రిపింది. ఊహించ‌ని ప‌రిణామంతో షాక్ తిన్న భ‌ర్త‌.. కారు ఆపి.. క‌డుపులో దిగిన బుల్లెట్ల కార‌ణంగా ర‌క్తం కారుతున్నా రోడ్డు మీద ప‌రిగెత్తుతూ.. రోడ్డు మీద వెళుత‌న్న బీఎంటీసీ బ‌స్సును ఎక్కేశాడు.

కాల్పులు జ‌రిపినా క‌సి తీర‌ని భార్య‌.. కారును డ్రైవ్ చేసుకుంటూ బ‌స్సును క్రాస్ చేసి.. బ‌స్సును ఆపి.. మ‌రోసారి భ‌ర్త మీద దాడి చేసే ప్ర‌య‌త్నం చేసింది. బ‌స్సులోని ప్ర‌యాణికుల్ని ఆమెను అడ్డుకొని.. పోలీసుల‌కు స‌మాచారం అందించి ఆమెను అప్ప‌గించారు. బుల్లెట్ల గాయాల పాలైన భ‌ర్త‌ను ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రిలో చేర్పించారు. భ‌ర్త ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని చెబుతున్నారు. త‌న‌పై చేయి చేసుకున్నందుకే భ‌ర్త‌పై కాల్పులు జ‌రిపిన‌ట్లుగా భార్య చెప్ప‌టం.. ఈ వెరైటీ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు