అమ్మ బాట‌లోకి ఆదిత్యనాథ్ వ‌చ్చేస్తున్నారు!

అమ్మ బాట‌లోకి ఆదిత్యనాథ్ వ‌చ్చేస్తున్నారు!

నిజ‌మే... త‌మిళ‌నాట దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఏ స‌మ‌యాన అమ్మ క్యాంటిన్ల పేరిట త‌క్కువ ధ‌ర‌కే పేద‌ల ఆక‌లి తీర్చే ప‌థ‌కాన్ని ఎంచుకున్నారో గానీ... క్ర‌మంగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఆ ప‌థ‌కాన్ని త‌మ ప్ర‌జ‌ల‌కు అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమ్మ క్యాంటీన్ల పేరిట జ‌య స‌ర్కారు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు అతి త‌క్కువ ధ‌ర‌కే ఆహారాన్ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌య ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన నాడు దేశ‌వ్యాప్తంగా ఇదో పెద్ద వార్త‌గానే నిలిచింది. ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ స్థాయి మీడియా కూడా అమ్మ క్యాంటీన్ల‌కు ఓ రేంజీలో ప్ర‌చారం చేశాయి.

ఇదంతా బాగానే ఉన్నా... త‌మిళ‌నాట అమ్మ క్యాంటీన్ల ఏర్పాటు ప్రారంభ‌మైన కొన్నాళ్ల‌కే తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా రూ.5ల‌కే భోజ‌నం అంటూ హైద‌రాబాదు ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో ఈ త‌ర‌హా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైద‌రాబాదులో స‌గ‌టు పేదోడికి ఈ క్యాంటీన్లు ఫుల్లుగా క‌డుపు నింపుతున్నాయి. ఇక తెలుగు నేల‌కు చెందిన మ‌రో రాష్ట్ర‌మైన న‌వ్యాంధ్ర‌లోనూ చంద్ర‌బాబు స‌ర్కారు అమ్మ బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటీన్ల పేరిట త‌క్కువ ధ‌ర‌కే ఆహారాన్ని అందించే క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకుంది. వెల‌గ‌పూడి స‌చివాలయంలో ఈ త‌రహా క్యాంటీన్ ఒక‌టి ఏర్పాటు కాగా.. ఉద్యోగులంతా చ‌క్క‌గా దానిని వినియోగించుకుంటున్నారు. త‌మిళ‌నాడు పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లోనూ న‌మ్మ క్యాంటీన్ల పేరిట త‌క్కువ ధ‌ర‌కే ఆహారాన్ని అందించేందుకు సిద్ధ‌రామ‌య్య స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

ఇక ఇప్పుడు అమ్మ బాట‌లోకి కొత్త‌గా యూపీ సీఎం ఆదిత్య‌నాథ్ యోగీ వ‌చ్చేస్తున్నారు. త‌క్కువ ధ‌ర‌కే ఆహారాన్ని అందించేందుకు ఓ కొత్త ప‌థ‌కాన్ని రూపొందిస్తున్న‌ట్లు యోగి స‌ర్కారు నిన్న ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఉదయం టిఫిన్‌గా పకోడా, పోహ, ఓట్స్‌తో తయారు చేసిన పదార్థాలు, టీ అన్ని కలిపి రూ.3లకే అంద‌నుంది. మధ్యాహ్నం, రాత్రి వేళలో అన్నం, చపాతీ, శాకాహార కూర, పప్పుతో కలిపి రూ.5లకే భోజ‌నాన్ని అందిస్తార‌ట‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 200 ప్రాంతాల్లో కొత్త‌గా రంగంలోకి దిగ‌నున్న ఈ క్యాంటీన్ల పేరును ఈ 'అన్న‌పూర్ణ' కేంద్రాలగా యోగి స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కం వ‌ల్ల వలస కూలీలు, పేద ప్ర‌జ‌ల‌కు లబ్ధి చేకూరుతుంద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు