మోడీ.. ఆవిడ పాతనోట్లు మారేలా చూడండి!

మోడీ.. ఆవిడ పాతనోట్లు మారేలా చూడండి!

నిజమే.. ఈ మ‌హిళ గురించి తెలిసిన వారంతా ఇప్పుడిదే మాట‌ను అంటున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో.. పెద్ద ఎత్తున పోగుప‌డిన బడాబాబుల‌కు ఏ మాత్రం సంబంధం లేనిది ఈ మ‌హిళ వ్య‌వ‌హారం. ప్ర‌స్తుతం ఆమె ద‌గ్గ‌రున్న రూ.10వేల పాత పెద్ద‌నోట్ల‌ను ఆమెకు మార్చేలా చేసేందుకు ప్ర‌ధాని స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా మ‌హిళా? త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ.10వేల పాత పెద్ద నోట్ల గురించి ఏకంగా ప్ర‌ధాని మోడీ దృష్టికే ఎందుకు తీసుకెళ్లార‌న్న విష‌యానికి వెళితే..

బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మ‌హిళ దీన గాథ విన్న వారంతా క‌రిగిపోతున్నారు. అయ్యోపాపం అన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. పెళ్లి చేసుకున్న మూడేళ్ల‌కే వేధింపులు త‌ట్టుకోలేక భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది బంగ్లా యువ‌తి. త‌ర్వాత ఒక వ‌స్త్ర‌ప‌రిశ్ర‌మ‌లో రూ.9వేల జీతానికి ప‌ని చేసింది. ఈ సంద‌ర్బంగా ప‌రిచ‌య‌మైన వారి మాట న‌మ్మి భార‌త్‌కు వ‌చ్చింది.

భార‌త్ కు కానీ వెళితే.. అక్క‌డ ఏ ప‌ని చేసినా నెల‌కు రూ.15వేలు సంపాదించొచ్చ‌న్న ఆశ‌తో భార‌త్‌కు వ‌చ్చిన ఆమెకు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఆమె న‌మ్మి వ‌చ్చిన వ్య‌క్తి.. ఆమెను ముంబ‌యి శివార్ల‌కు తీసుకొచ్చి ఒక నేపాలీకి రూ.50వేల‌కు అమ్మేశాడు. అనంత‌రం ఆమెను బెంగ‌ళూరుకు త‌ర‌లించి బ‌ల‌వంతంగా వ్య‌భిచారంలోకి దించారు. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్‌కు పంపుతామంటూ ఫుణేకు పంపారు. అక్క‌డి బుధ‌వార్ పేట‌లోని వ్య‌భిచార గృహంలో మ‌గ్గిపోయింది. ఇలాంటివేళ 2015 డిసెంబ‌రులో పోలీసులు ఆమెను ర‌క్షించారు.

అయితే.. ఆమె జాతీయ‌త విస‌యంలో నెల‌కొన్న ఇబ్బందుల దృష్ట్యా ఆమె భార‌త్‌లో ఉండిపోయింది. తాజాగా ఆమెను బంగ్లాదేశ్ పౌరురాలిగా గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోనున్నారు. అయితే.. త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ.10వేల పాత పెద్ద‌నోట్ల‌ను కొత్త నోట్లుగా మార్చేలా అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె వేడుకొంటోంది. ఈ మేర‌కు ప్ర‌ధాని మోడీకి లేఖ రాసింది. త‌న ద‌గ్గ‌రున్న పాత పెద్ద‌నోట్లు అన్ని విటులు ఇచ్చిన టిప్స్ ను దాచుకోగా ఈ మొత్తం వ‌చ్చింద‌ని.. అదే త‌న ద‌గ్గ‌ర ఉన్న మొత్త‌మ‌ని.. త‌న‌ను ఆదుకోవాల‌ని ఆమె వేడుకొంటోంది. ఆమె ఉదంతం గురించి విన్న వారంతా.. అయ్యో ఆమెను ఆదుకోవాల్సిందేన‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు