వర్మ కులాల గొడవగా మారుస్తున్నాడే..

వర్మ కులాల గొడవగా మారుస్తున్నాడే..

ఔనన్నా కాదన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కులం జాఢ్యం విపరీతంగా ఉన్న మాట వాస్తవం. సినీ అభిమానుల్లో సైతం ఈ విభజన స్పష్టంగా ఉంది. టాలీవుడ్ హీరోల్లో ఎవరు ఏ కులం అన్నది జనాలకు బాగా తెలుసు. కులం ఆధారంగా హీరోల్ని ఆరాధించేవాళ్లు కోకొల్లలు.

కాకపోతే ఎవ్వరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడరు. కానీ లోలోన కులాభిమానం.. కులం కుమ్ములాటలు కొనసాగుతూ ఉంటాయి. దీనిపై ఓపెన్‌గా మాట్లాడేవాళ్లు అరుదు. ఐతే తాను ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడే రామ్ గోపాల్ వర్మ మాత్రం దీనిపై ఓపెన్ అయిపోయాడు. ప్రభాస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. హీరోలు-కులాలు-అభిమానులు అనే కాన్సెప్ట్ మీద స్పందించాడు వర్మ.

మిగతా హీరోలు కాపులు, కమ్మలు అంటూ తమ కుల అభిమానుల మీద ఫోకస్ పెట్టినట్లే.. ప్రభాస్ తన కులస్థులైన రాజుల మీద దృష్టిసారించి ఉంటే.. అతను 'రీజనల్' స్థాయికి పరిమితం అయ్యేవాడని.. అలా చేయలేదు కాబట్టే అతను ఇంటర్నేషనల్ రేంజికి ఎదిగాడని తీర్మానించాడు వర్మ. ప్రాంతీయ అభిమానుల గురించి పట్టించుకోకపోవడం వల్లే ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నాడన్నాడు వర్మ. ప్రాంతీయ అభిమానుల్ని పట్టించుకునేవాళ్లు ప్రాంతీయ స్థాయిలోనే ఉండిపోతారని ఎద్దేవా చేశాడు వర్మ. ఆర్జీవీ ట్వీట్లు కచ్చితంగా మిగతా హీరోల అభిమానుల్లో కాక తెప్పించేవే.

ఐతే ప్రభాస్ మిగతా హీరోలతో పోలిస్తే కులం.. అభిమానం లాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోనట్లే ఉంటాడన్న మాట వాస్తవం. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడతను. ఐతే ప్రభాస్ ఇప్పుడున్న స్థాయికి.. క్యాస్ట్‌ను పట్టించుకుంటాడా లేదా అనేదానికి ఎలాంటి సంబంధం లేదు. 'బాహుబలి' కారణంగానే అతడికీ స్థాయి వచ్చిందన్నది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది వదిలేసి వర్మ కులాల ప్రస్తావనతో గొడవలు పెట్టే పనెందుకు పెట్టుకుంటున్నాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు