బాబుకు మిర్చి వార్నింగ్ ఇచ్చిన ప‌వ‌న్‌

బాబుకు మిర్చి వార్నింగ్ ఇచ్చిన ప‌వ‌న్‌

స‌భ‌లు.. స‌మావేశాల్ని నిర్వ‌హించ‌కుండా.. అప్పుడ‌ప్ప‌డు లేఖాస్త్రాల‌తోనూ.. ప్రెస్ నోట్ల‌తో త‌న వాద‌న‌ను వినిపిస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సినిమా ఘూటింగ్‌ల్లో బిజీగా ఉంటూ.. ఆట విడుపుగా అన్న‌ట్లుగా ఎంపిక వివిధ అంశాల మీద ప్రెస్ రిలీజ్ ల‌ను ప‌వ‌న్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ ఈ మ‌ధ్య అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఓప‌క్క రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు త‌మ పంట‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌క కిందామీదా ప‌డుతుంటే.. ఇంత‌కాలం కామ్ గా ఉన్న ఆయ‌న‌.. రైతులు రోడ్ల మీద‌కు వ‌చ్చి తమ ఆందోళ‌న‌ను తీవ్రత‌రం చేసిన వేళ‌.. ఒక ప్రెస్ రిలీజ్‌ను విడుద‌ల చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

విదేశీ పెట్టుబ‌డుల కోసం విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద చూపించే శ్ర‌ద్ధ దేశానికి ప‌ట్టెడు అన్నం పెట్టే రైతుల‌పై చూపించ‌క‌పోవ‌టం వ‌ల్లే రైతులు రోడ్లు ఎక్కాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లుగా తాజా ప్రెస్ నోట్లో విరుచుకుప‌డ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల ఆందోళ‌న‌లు ప్రభుత్వాదినేత నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నంగా అభివ‌ర్ణించిన ప‌వ‌న్‌.. ఆరుగాలం శ్ర‌మించి పండించే రైతు క‌న్నీరు పెట్ట‌టం దేశానికి శ్రేయ‌స్క‌రం కాద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేశారు.

ఈ సీజ‌న్లో మిర్చి పంట ఎంత విస్తీర్ణంలో ఎంత వేయాలో రైతుల‌కు ముందుగా తెలియ‌జేయ‌టంలో వ్య‌వ‌సాయ శాఖ విఫ‌ల‌మైతే.. పండిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించేట‌ట్లు చేయ‌టంలో మార్కెటింగ్ శాఖ వైఫ‌ల్యంగా త‌మ పార్టీ భావిస్తోంద‌న్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలుక్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించి క్వింటాలు మిర్చికి రూ.11వేల చొప్పున రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ఇవ్వాల‌న్న సూచ‌న‌ను చేశారు. ప్ర‌స్తుతం క్వింటాలు మిర్చి ధ‌ర రూ.2వేల నుంచి రూ.4వేల మ‌ధ్య ఉన్న వేళ‌.. అందుకు మూడు  రెట్లు అధికంగా ప‌వ‌న్ ఫిక్స్ చేసిన ధ‌ర‌పై ఇద్ద‌రు చంద్రుళ్లు ఎలా రియాక్ట్ అవుతారో?