యాభై పాకిస్థానీయుల త‌ల‌లు తెమ్మంది

యాభై పాకిస్థానీయుల త‌ల‌లు తెమ్మంది

పైశాచికంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. భార‌త సైనికుల్ని ముక్క‌లుముక్క‌లుగా న‌రికిన దాయాది పాకిస్థాన్ తీరుపై భార‌తీయుల ర‌క్తం మ‌రిగిపోతోంది. అంత‌కంత‌కూ పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల‌న్న మాట‌ను ప‌లువురు వినిపిస్తున్నారు. వీర జ‌వానుల త్యాగంపై దేశీయుల స్పంద‌న ఇలా ఉంటే.. వారి కుటుంబ స‌భ్యుల తీరు మ‌రెలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.

పాక్ సైనికుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగ‌ర్ కుమార్తె స‌రోజ్ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రిని అత్యంత దారుణంగా చంపిన పాకిస్థానీయులకు అలాంటి బ‌దులే తీర్చుకోవాల‌ని.. త‌న‌కు 50 మంది పాకిస్థానీయుల త‌ల‌లు తీసుకురావాల‌ని స్పందించారు.

త‌న తండ్రి మ‌ర‌ణాన్ని త‌మ‌కు ఇంత‌వ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి స‌మాచారం అందివ్వ‌లేదంటూ ఆర్మీ తీరును త‌ప్పు ప‌ట్టిన ఆమె మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఇదిలా ఉంటే.. ఇదే దాడిలో ప్రాణాలు కోల్పోయిన మ‌రో వీర జ‌వాను నాయ‌బ్ స‌బ్ ప‌ర‌మ్ జీత్ సింగ్ ఇటీవ‌లే కొత్త ఇల్లు క‌ట్టుకున్నార‌ని.. ఆ ఇంట్లో గృహ‌ప్ర‌వేశం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేద‌ని.. శుభ‌కార్యానికి బ‌దులుగా ఆయ‌న శవంతో గృహ‌ప్ర‌వేశం చేయించాల్సి వ‌స్తోందంటూ వీర జ‌వాను సోద‌రుడు వాపోతున్న తీరు ప‌లువురు కంట క‌న్నీరు తెప్పిస్తోంది.

త‌న తండ్రి దేశం కోసం ప్రాణ‌త్యాగం చేశాడ‌ని.. ఆ విష‌యం త‌న‌కు గ‌ర్వంగా ఉందంటూ ప‌ర‌మ్ జీత్ కుమార్తె సిమ్ర‌న్ దీప్ వ్యాఖ్యానించారు. పుట్టెడు శోకంలోనూ.. దేశం కోసం వారు ప‌డుతున్న త‌ప‌న ప్ర‌తి భారతీయుడ్ని క‌దిలిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు