కేసీఆర్ మార్క్‌: 8 నిమిషాల్లో క్లోజ్

కేసీఆర్ మార్క్‌: 8 నిమిషాల్లో క్లోజ్

అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌ర‌గాల్సిందేన‌న్న తీరు అధినేత‌ల్లో త‌ర‌చూ క‌నిపిస్తూ ఉంటుంది. చేతిలో అధికారం లేకుంటే ఇబ్బంది త‌ప్ప‌దు కానీ.. చేతిలో అధికారంలో ఉంటే ఇక చెప్పాల్సిందేముంది? తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు పూర్తి చేయ‌టానికిఎలాంటి అడ్డంకి ఉండ‌దు. ఇప్పుడా విష‌యాన్ని అంద‌రికి అనుభ‌వ‌మ‌య్యేలా చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. కొంపలు మునిగిపోతున్న‌ట్లుగా భూసేక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు తెలంగాణ అసెంబ్లీ.. శాస‌న‌మండ‌లి ఈ రోజు ప్ర‌త్యేకంగా కొలువు తీర‌టం తెలిసిందే.

దీనిపై ఇప్ప‌టికే ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అస్స‌లు ప‌ట్టించుకోలేదు. షెడ్యూల్ ప్ర‌కారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. కేవ‌లం ఎనిమిదంటే ఎనిమిది నిమిషాల వ్య‌వ‌ధిలోనే అనుకున్న బిల్లును అనుకున్న‌ట్లే ఆమోదించేశారు. ప‌దంటే ప‌ది నిమిషాలు గ‌డిచేస‌రికి.. బిల్లు ఆమోదం పొంద‌టం.. స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేయ‌టం లాంటివి జ‌రిగిపోయాయి.

భూసేక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ కోసం అసెంబ్లీని కొలువు తీర్చాల్సిన అవ‌స‌రం ఉందా? అంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ నేత‌లు నినాదాలు.. డిమాండ్లు చేస్తున్న వేళ‌.. ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ స‌భ‌లో స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ పెట్టారు.
దీనిపై కాంగ్రెస్ స‌భ్యులు ఓప‌క్క అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నా.. వాటిని ప‌ట్టించుకో్కుండా.. స‌వ‌ర‌ణ బిల్లుఆమోదం మీద‌నే దృష్టి పెట్టారు. ఎనిమిది నిమిషాల వ్య‌వ‌ధిలోనే స‌వ‌ర‌ణ బిల్లును ఆమోదిస్తున్న‌ట్లుగా స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

స‌భ‌లో దీనిపై ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే.. స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లుగా స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి ప్ర‌క‌టించారు. గంద‌ర‌గోళం మ‌ధ్య‌నే స‌భ ప్రారంభం కావ‌టం.. స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం చెందం.. స‌భ వాయిదా ప‌డిపోవ‌టం ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టి జ‌రిగిపోయాయి. కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి అనుకుంటే జ‌ర‌గనిది ఏముంటుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు