చాయ్ బిల్లు కంటే త‌క్కువ ధ‌ర‌కే విమానం ఎక్కొచ్చు

చాయ్ బిల్లు కంటే త‌క్కువ ధ‌ర‌కే విమానం ఎక్కొచ్చు

ఉడాన్ విమాన స‌ర్వీసుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్లే ఫ్ల‌యిట్‌కు ఆయ‌న పచ్చజెండా ఊపారు. ఉడాన్ స్కీమ్ కింద ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్లే విమాన టికెట్ ధ‌ర కేవ‌లం రూ.2500 మాత్ర‌మే. అతి త‌క్కువ ధ‌ర‌కు విమాన స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఉడాన్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఉడాన్ (యూడీఏఎన్‌) అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగ‌రిక్. జాతీయ పౌర విమాన‌యాన ప‌థ‌కం కింద ఉడాన్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

500 కిలోమీట‌ర్ల దూరానికి లేదా 30 నిమిషాల జ‌ర్నీకి కనీసం రూ.2500 ఛార్జ్ చేస్తున్నారు. ఉడాన్ స్కీమ్ కింద పశ్చిమ ప్రాంతంలో 24, ఉత్తర ప్రాంతంలో 17, ద‌క్షిణ ప్రాంతంలో 11, తూర్పు ప్రాంతంలో 12 విమానాశ్రయాల‌ను అనుసంధానం చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సుమారు 45 విమానాశ్ర‌యాల‌ను క‌ల‌పాల‌న్నదే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్దేశం. కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య కూడా ఉడాన్ సేవలు ప్రారంభంకానున్నాయి.


ఉడాన్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి విమాన ప్రయాణాన్ని తేవటమే ఉడాన్ సర్వీస్ లక్ష్యమన్నారు. ఉడాన్ సర్వీస్‌లో రూ.2,500 ఖర్చుతో గంటలోపు ప్రయాణం చేయవచ్చని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఉడాన్ విమానంలో ఇపుడు ఢిల్లీ నుంచి షిమ్లాకు రూ.2500 ఖర్చుతో వెళ్లొచ్చని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

మధ్య తరగతి ప్రజల అభిలాష తీర్చేందుకే ఉడాన్ విమాన సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ప్రధాని అన్నారు. "ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.10 ఖర్చు అవుతోంది. ఉడాన్ సర్వీసుల్లో కిలో మీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు ఉంటుంది" అని అన్నారు. టైర్-2, టైర్-3 నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. టైర్-2, టైర్-3 నగరాలకు విమాన సేవలు అందిస్తే ప్రయోజనం కలుగుతుందని వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు