బుక్ మై షో.. దగాలో భాగమేనా?

బుక్ మై షో.. దగాలో భాగమేనా?

రెండు మూడు రోజుల నుంచి 'బుక్ మై షో' పడి కొట్టుకుంటున్నారు 'బాహుబలి' ప్రియులు. 'ది కంక్లూజన్' టికెట్లు కొనడానికి వాళ్లు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. థియేటర్ల దగ్గరికెళ్తే టికెట్లు లేవు.. అంతా ఆన్ లైన్ అంటున్నారు. ఆన్ లైన్లో చూస్తే టికెట్లు దొరికే అవకాశమే కనిపించట్లేదు. డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ల యాజమాన్యాలు కలిసి టికెట్లన్నీ బ్లాక్ చేసేసి.. 'బుక్ మై షో'లో పెద్ద షోనే నడిపిస్తున్నారు. ఈ దగాలో 'బుక్ మై షో' నిర్వాహకులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్లే కనిపిస్తోంది. వారి సహకారం లేకుండా ఈ డ్రామాను నడిపించడం సాధ్యం కాదు.

కొన్ని గంటల పాటు ప్రయత్నం చేసినా.. 'బుక్ మై షో' ద్వారా బాహుబలి-2 టికెట్లను బుక్ చేయడానికి వీలు కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏదో ఒక థియేటర్లో.. ఒక షోను ఎంచుకుని లోపలికి వెళ్లగానే టికెట్లు ఎంచుకోమని ఆప్షన్ వస్తుంది. అవి ఎంచుకుని పేమెంట్ కోసం ప్రొసీడ్ కొట్టాక.. సంథింగ్ వెంట్ రాంగ్ అనో.. వేరే టికెట్లను ఎంచుకోమనో.. ఇంకేదో మెసేజో వస్తుంది. రిఫ్రెష్ చేసి చూసేసరికి కొత్త సీట్లు అవైలబుల్ అని కనిపిస్తుంది. వాటిని ఎంచుకున్నా అంతే. ఇలా ఎంతసేపు ప్రయత్నించినా.. టికెట్ మాత్రం బుక్కవదు.

టికెట్లన్నీ బ్లాక్ చేసి.. ఊరికే జనాల్ని ఫూల్స్‌ను చేయడానికి డ్రామా నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఈ వ్యవహారం చూస్తే. థియేటర్ల దగ్గరికెళ్లి దీనిపై ప్రశ్నిస్తే.. మాకేం సంబంధం లేదు. బుక్ మై షో వాళ్లను అడగమంటారు. కస్టమర్ కేర్ ద్వారా వాళ్లను అడుగుదామంటే లైనే కలవదు. దీంతో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులో ఉంచినట్లుగా షో చేసి.. మొత్తం టికెట్లను ఫ్యాన్సీ రేట్లకు గుంపగుత్తగా అమ్ముకునే దందా నడుస్తోంది ప్రస్తుతం. మల్టీప్లెక్సులు.. సింగిల్ స్క్రీన్లు.. ఏదైనా తేడా ఏమీ లేదు.

ప్రసాద్ ఐమాక్స్, మరికొన్ని థియేటర్ల యాజమాన్యాలు మాత్రం థియేటర్ల దగ్గర జనాలకు కొంత మేరకు టికెట్లు అమ్ముతున్నాయి. మిగతా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం డిస్ట్రిబ్యూటర్లతో కలిసి దందా నడిపిస్తున్నాయి. ఈ దందాలో 'బుక్ మై షో' వాళ్లు కూడా భాగస్వాములు కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English