అరే.. మీడియా మీద అలా ప‌డిపోతావేం

అరే.. మీడియా మీద అలా ప‌డిపోతావేం

త‌ప్పుల మీద త‌ప్పులు చేసేయ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు ప‌ని చేయ‌టం చేత‌కాక‌.. ప‌వ‌ర్ చేజారిన త‌ర్వాత తీరిగ్గా వేద‌న చెందే విచిత్ర‌మైన క్యారెక్ట‌ర్లు కొన్ని క‌నిపిస్తుంటాయి. చేతిలోఉన్న‌ప్పుడు అధికారం విలువ తెలియ‌ని ఇలాంటి బ్యాచ్‌.. ప‌వ‌ర్ పోయిన త‌ర్వాత వాళ్ల మీదా వీళ్ల మీదా విమ‌ర్శ‌లు చేసేసి బండి లాగిస్తుంటారు. తాజాగా ఇలాంటి ధోర‌ణినే ప్ర‌ద‌ర్శిస్తున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్‌.

చేతిలో ప‌వ‌ర్ ఉన్న వేళ‌లో.. తండ్రితోనూ.. బాబాయ్ తోనూ సంబంధాలు స‌రిగా పెట్టుకోక‌..నిత్యం త‌గులాడుకుంటూ.. మీడియా ఎదుట‌కు వ‌చ్చి బాహాటంగానే తిట్టేసుకున్న‌అఖిలేశ్‌.. ఇప్పుడేమో మీడియా అంటేనే విరుచుకుప‌డుతున్నారు. ప‌రిపాలించాల్సిన టైంలో ఈ ఫ్యామిలీ ర‌చ్చ ఏందంటూ ప్ర‌శ్నించిన వారిని ప‌ట్టిచుకోని అఖిలేశ్ కు.. తాజాగా సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన యోగి అదిత్య‌నాథ్‌ను చూస్తున్న ఆయ‌న తెగ ఫీల్ అయిపోతున్నాడ‌ట‌.

తాను సీఎంగా ఉన్న‌ప్పుడు మీడియా రియాక్ట్ అయిన దానికి.. యోగి హ‌యాంకు అస్స‌లు సంబంధం లేదంటూ మండిప‌డుతున్నాడు. త‌మ ఓట‌మికి కార‌ణం కుటుంబ క‌ల‌హా.. చేత‌కాని పాల‌న లాంటి అంశాల్ని వ‌దిలేసి.. మీడియా మీద ప‌డిపోతున్నాడు. త‌మ కుటుంబంలో ఏర్ప‌డిన వివాదాన్ని మీడియా అతి చేయ‌టం వ‌ల్లే తాము అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన‌ట్లుగా వ్యాఖ్యానించాడు. అది త‌న మాట కాద‌ని.. మీ తోటి జ‌ర్న‌లిస్టులే చెప్పారంటూ.. మీడియా ప్ర‌తినిధుల మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయినా.. ఏ కుటుంబంలో లేవు విభేదాలు? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. రాష్ట్రంలోఏ నేరం జ‌రిగినా.. ఆ నేరంతో పాటు త‌న ఫోటో వేసి మ‌రీ టీవీల్లో చూపించే వార‌ని.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. ష‌హ‌రాన్ పూర్ లో అల్ల‌ర్లు.. అల‌హాబాద్ లో హ‌త్య‌లు జ‌రిగాయ‌ని.. ఇప్పుడు వార్త‌ల ప్ర‌సారంలో ముఖ్య‌మంత్రి యోగి ఫోటో వేసి చూపించ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

ఏ కుటుంబంలో క‌ల‌హాలు లేవ‌ని ప్ర‌శ్నిస్తున్న అఖిలేశ్‌.. ఎన్ని గొడ‌వ‌లున్నా.. గుట్టుగా కూర్చొని సెటిల్ చేసుకుంటున్న వారే కానీ.. బ‌రితెగింపుతో వ్య‌వ‌హ‌రిస్తూ అఖిలేశ్‌.. ములాయంల మాదిరి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన వారెవ‌రూ లేర‌న్న విష‌యాన్ని అఖిలేశ్ గుర్తుంచుకుంటే మంచిదేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు