వైరల్ పిక్.. జడ్డూ విశ్వరూపం

రవీంద్ర జడేజా.. రవీంద్ర జడేజా.. ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ గురించే చర్చ. ఒక ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో 36 పరుగులు రాబట్టడమే అనూహ్యం అనుకుంటే.. ఆరు బంతుల్లో ఏకంగా 37 రాబట్టి ఔరా అనిపించాడు జడ్డూ. అందులోనూ అతను ఇలా విధ్వంసం సృష్టించింది సూపర్ ఫామ్‌లో ఉన్న బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కావడం విశేషం. అతను ఈ ఐపీఎల్‌లో అదరగొడుతూ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.

చెన్నైతో మ్యాచ్‌లోనూ తొలి మూడు ఓవర్లలో హర్షల్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాంటి బౌలర్‌ను ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జడ్డూ ఉతికారేసిన వైనం అనూహ్యం. అతనిలా విధ్వంసం సృష్టించడం ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ మోతెక్కిపోయాయి. జడ్డూకు వీర లెవెల్లో ఎలివేషన్లు ఇస్తూ మీమ్స్ వేశారు నెటిజన్లు.

జడ్డూ దూకుడు బ్యాటింగ్ వరకే ఆగిపోలేదు. తర్వాత చెన్నై బౌలింగ్ సందర్భంగానూ అతను అదరగొట్టేశాడు. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు మెరుపు వీరులు మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌లవి కావడం విశేషం. వాళ్లిద్దరినీ అతను బౌల్డ్ చేయడం గమనార్హం. బ్యాటింగ్ పిచ్ మీద జడ్డూ ఒక మెయిడెన్ కూడా వేశాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిసిన జడేజా ఒక రనౌట్ కూడా చేశాడు.

మొత్తంగా బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా అదరగొట్టి.. ఆర్సీబీని ఒంటి చేత్తో ఓడించేశాడు ఈ ఆల్‌రౌండర్. గతంలో జడ్డూను బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్‌గా పేర్కొని విమర్శలెదుర్కొన్న సంజయ్ మంజ్రేకర్‌ను ఇప్పుడు మరోసారి నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. అలాగే జడ్డూ ఆల్ రౌండ్ మెరుపులకు, అతడి బహుముఖ ప్రజ్ఞకు సూచికగా ఒక ఎడిట్ కూడా తయారు చేశారు. అది ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ స్టేటస్‌ల్లో హల్‌చల్ చేస్తోంది.