ఓయూ వందేళ్ల పండ‌గ‌లో కేసీఆర్ స్పీచ్ లేదెందుకు?

ఓయూ వందేళ్ల పండ‌గ‌లో కేసీఆర్ స్పీచ్ లేదెందుకు?

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప్ర‌త్యేక‌త ఇదేనేమో. చైత‌న్యానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వ‌ట‌మే కాదు.. రాజ్యాధికారం సైతం ఉస్మానియా వ‌ర్సిటీ పాదాల ముందు త‌ల వంచాల్సిందే త‌ప్పించి.. త‌ల ఎగ‌రేయ‌లేర‌న్న విద్యార్థుల మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే తాజా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మ పురిటిగ‌డ్డ‌గా నిల‌వ‌ట‌మే కాదు.. ఉద్య‌మం మొత్తాన్ని ఓయూ ఏర‌కంగా డ్రైవ్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.
తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కేసీఆర్ ఏళ్ల‌కు ఏళ్ల త‌ర‌బ‌డి పోరాడినా.. ఉస్మానియా క్యాంప‌స్ సీన్లోకి వ‌చ్చాక విభ‌జ‌న లెక్క‌లు ఎంత‌గా మారాయో.. ఉద్య‌మ స్వ‌రూపం ఏ విధంగా మారిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఉద్య‌మాన్ని త‌న చేతుల్లోకి తీసుకున్న ఉస్మానియా విద్యార్థుల వెనుక‌నే కేసీఆర్ న‌డ‌వాల్సి వ‌చ్చింది. అయితే.. రాజ‌కీయ నాయ‌కుడిగా..ఉద్య‌మ నేత‌గా త‌న‌కున్న విశేష అనుభ‌వాన్ని రంగ‌రించి.. ఎప్పుడు త‌గ్గాలో త‌గ్గుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో చాంఫియ‌న్ గా నిల‌వ‌టంతో పాటు.. రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్‌.
చేతిలో ప‌వ‌ర్ ఉన్నా.. ఉస్మానియా క్యాంప‌స్ తో పెట్టుకుంటే అంతే సంగ‌తుల‌న్న విష‌యం బాగా తెలిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఓయూ వందేళ్ల పండ‌గ సంద‌ర్భంగా క్యాంప‌స్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా రాష్ట్రప‌తి పాల్గొంటే.. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. ముఖ్య‌మంత్రికేసీఆర్ పాల్గొన్నారు.

విద్యార్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కేసీఆర్ స‌ర్కారు చేసిందేమీ లేద‌న్న ఆగ్ర‌హంలో ఉన్నారు. ఈనేప‌థ్యంలో ఉస్మానియా క్యాంప‌స్ లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో కేసీఆర్ ప్ర‌సంగాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అడ్డుకుంటామ‌ని శ‌ప‌ద‌మే పూనారు. దీనికి త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు చేసుకున్న‌ట్లుగా చెబుతారు. ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు.. కేసీఆర్ ప్ర‌సంగం కానీ ఓయూలో ఉంటే విద్యార్థుల నుంచి లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని.. మాట్లాడి ర‌చ్చ చేసుకునే క‌న్నా.. కామ్ గా ఉండిపోవ‌టం మంచిద‌న్న భావ‌న‌ను పోలీసు వ‌ర్గాలు వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు.
కేసీఆర్ ప్ర‌సంగాన్ని.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు వ్యూహ‌ర‌చ‌న చేసుకున్నార‌న్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదే స‌మాచారాన్ని రాజ్ భ‌వ‌న్ కు తెలియ‌జేయ‌టంతో ముందుగా అనుకున్న షెడ్యూల్ కు భిన్నంగా ముఖ్య‌మంత్రి.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాలు లేకుండా వందేళ్ల ఉత్స‌వం ముగిసిన‌ట్లుగా చెప్పాలి. షెడ్యూల్ ప్ర‌కారం ఉన్న స్పీచుల్ని ప‌క్క‌న పెట్టేసి.. రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌సంగంతో కార్య‌క్ర‌మాన్ని ముగించ‌టాన్ని ఏ మాత్రం అంచ‌నా వేయ‌లేని విద్యార్థి సంఘాల‌కు షాకిచ్చిన‌ట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నా.. తమ పంతానికి త‌గ్గ‌ట్లే ముఖ్య‌మంత్రి చేత మాట్లాడ‌నివ్వ‌కుండా ఉండ‌టంతో తాము విజ‌యం సాధించిన‌ట్లుగా ఉస్మానియా విద్యార్థులు చెబుతున్నారు. ఏమైనా ఒక ల్యాండ్ మార్క్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం లేకుండా ముగిసిన వైనం భ‌విష్య‌త్ త‌రాల‌కు క‌చ్ఛితంగా గుర్తుండ‌ట‌మే కాదు.. ఉస్మానియా విద్యార్థుల చైత‌న్యానికి.. ఉద్య‌మ‌పోరుకు ఒక నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు