బాబుతో భేటీకి ఆ ఇద్ద‌రు త‌మ్ముళ్లు మిస్‌!

బాబుతో భేటీకి ఆ ఇద్ద‌రు త‌మ్ముళ్లు మిస్‌!

సొంత జిల్లాలో ఏపీ ముఖ్య‌మంత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా క‌నిపిస్తోంది. అధికార‌ప‌క్ష అధినేత‌గా రాష్ట్రం మొత్తం త‌న అధిప‌త్యాన్ని.. అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించాల్సిన వేళ‌.. సొంత జిల్లాలో సొంత పార్టీ నేత‌ల అసంతృప్తికి గురైన వైనం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టించ‌టం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిపిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఉద్వాస‌న‌కు గురైన మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి.. బాబు నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. పార్టీ పైనా.. బాబు నిర్ణ‌యం మీదా తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

ఒక‌ద‌శ‌లో తాను తీవ్ర నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించి.. ఆపై వెన‌క్కి త‌గ్గినట్లుగా క‌నిపించారు. బొజ్జ‌ల‌ను బుజ్జ‌గించేందుకు పెద్ద ఎత్తున నేత‌ల్ని రంగంలోకి దించిన బాబు ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మైన‌ట్లుగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. అదేమీ నిజం కాద‌న్న విష‌యం తాజాగా నిరూపిత‌మైంది. ఇక‌.. అధికార‌పార్టీకి చెందిన ఎంపీ శివ‌ప్ర‌సాద్ సైతం అధినేత మీద ఆగ్ర‌హంతో ఉన్న విష‌యం తెలిసిందే. పార్టీలో బీసీల‌కు.. ద‌ళితుల‌కు అవ‌మానాలు.. అన్యాయాలు జ‌రుగుతున్న‌ట్లుగా చెప్పి.. అధినేత మీద నేరుగా విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించి సంచ‌ల‌నం సృష్టించిన శివ‌ప్ర‌సాద్‌.. త‌న అసంతృప్తిని ఇంకా వీడ‌లేద‌న్న విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది.

సొంత జిల్లాకు చెందిన ఇరువురు సీనియ‌ర్ నేత‌లు బాబు మీద గుస్సాగా ఉండ‌ట‌మే కాదు..తాజాగా జ‌రిగిన జిల్లా పార్టీ నేత‌ల స‌మావేశానికి వారు డుమ్మా కొట్ట‌టం గ‌మ‌నార్హం. సొంత జిల్లా నేత‌ల‌తో బాబు స‌మావేశం కాగా.. దీనికి బొజ్జ‌ల‌.. శివ‌ప్ర‌సాద్‌లు ఇద్ద‌రూ గైర్హాజ‌రు కావ‌టం విశేషం. అధినేత నేరుగా నిర్వ‌హిస్తున్న జిల్లా రివ్యూ స‌మావేశానికి గైర్హాజ‌రు కావ‌టం ద్వారా.. త‌మ‌కున్న అసంతృప్తిని బాహాటంగా చెప్పిన‌ట్లు అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు