చిన్న‌మ్మ‌కు షాక్‌...దిన‌క‌ర‌న్ అరెస్ట్‌

చిన్న‌మ్మ‌కు షాక్‌...దిన‌క‌ర‌న్ అరెస్ట్‌

త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ నాయ‌కురాలు, చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడీఎంకే(అమ్మ) పార్టీ నాయకుడు, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మంగళవారం అర్ధరాత్రి అరెస్టయ్యారు. ఈ ప‌రిణామం త‌మిళ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ముడుపులు ముట్టజెప్పిన కేసులో వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్టు చేస్తునట్లు ప్రకటించారు. మధ్యవర్తి సుకేశ్ చంద్రశేఖర్‌తో సమావేశమైన మాట వాస్తవమేనని దినకరన్ అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దినకరన్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు జనార్దన్, స్నేహితుడు మల్లికార్జునను పోలీసులు మంగళవారం ఆరు గంటలకుపైగా ప్రశ్నించారు. దివంగత జయలలిత న్యాయవాది కుమార్‌ను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్టు సమాచారం.

కాగా, అంత‌కుముందు జ‌రిగిన విచార‌ణ‌లో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం కేసులో దర్యాప్తుపై ఢిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. టీటీవీ దినకరన్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని జడ్జి ప్రశ్నించారు. దినకరన్‌ను ఇంకా విచారించాల్సి ఉందని, అందుకే అరెస్ట్ చేయ‌లేద‌ని పోలీసులు తెలిపిన స‌మాధానంపై న్యాయ‌మూర్తి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేసు స‌రైన‌ రీతిలో ముందుకు సాగేందుకు పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు