బాబు త‌ర‌హాలోనే మాట్లాడుతున్న హ‌రీశ్‌

బాబు త‌ర‌హాలోనే మాట్లాడుతున్న హ‌రీశ్‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మాట‌ల‌తో ఎట‌కారం చేసుకోగ‌ల తెలంగాణ నాయ‌కుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌టి వ‌ర‌సులో ఉంటే.. త‌ర్వాతి స్థానాల్లో ఉండే నేత‌ల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ ఒక‌ర‌ని చెప్పొచ్చు. ప్ర‌త్య‌ర్థుల్ని సూటిగా తాకుతూ.. కొట్టిన‌ట్లుగా ఉండే హ‌రీశ్ మాట‌ల్లో ప‌దును ఎక్కువ‌నే చెప్పాలి. స‌బ్జెక్ట్‌తో పాటు.. మ‌సాలా ద‌ట్టించిన మాట‌ల‌కు హ‌రీశ్ పెట్టింది పేరు. మేన‌మామ క‌మ్ అధినేత కేసీఆర్ మీద అచంచ‌ల‌మైన అభిమానానికి నిద‌ర్శ‌నంగా హ‌రీశ్ మాట‌లు క‌నిపిస్తాయి.

మొన్న‌టి వ‌ర‌కూ టీఆర్ఎస్ అధికారం గురించి మాట్లాడే సంద‌ర్భంలో రానున్న ప‌దేళ్ల‌లో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా మాట్లాడేవారు హ‌రీశ్‌. మ‌రి.. ఉన్న‌ట్లుండి ఏమైందో కానీ.. ఆయ‌న మాట తీరు మారింది. టీఆర్ఎస్‌లో కేసీఆర్ స్థానం గురించి.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ స్థానం గురించి స‌రికొత్త‌గా మాట్లాడ‌టం మొద‌లెట్టారు.

టీఆర్ఎస్‌కు తిరుగులేద‌ని.. రానున్న ఇర‌వై ఏళ్ల వ‌ర‌కూ త‌మ పార్టీనే అధికారంలో ఉండ‌నుంద‌ని తేల్చి చెప్పారు హ‌రీశ్‌. వ‌రంగ‌ల్‌లో జ‌ర‌గ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు వ‌చ్చిన హ‌రీశ్‌.. మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రెండు ద‌శాబ్దాలు టీఆర్ఎస్ పార్టీవేన‌ని చెప్పిన ఆయ‌న‌.. తెలంగాణ ప్ర‌జ‌లంతా కేసీఆర్ పాల‌న ప‌ట్ల విప‌రీత‌మైన సంతృప్తితో ఉన్న‌ట్లుగా చెప్పారు.

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. బీజేపీ సైతం త‌మ‌తో పోటీ ప‌డ‌లేద‌న్నారు. ఇక‌.. టీఆర్ఎస్‌లో ఒక‌టి నుంచి వెయ్యి స్థానాల వ‌ర‌కూ కేసీఆరేన‌ని చెప్పిన ఆయ‌న‌.. నెంబ‌ర్ గేమ్ లేద‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. హ‌రీశ్ మాట‌ల్ని విన్నంత‌నే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌లు చ‌ప్పున గుర్తుకు వ‌స్తుంటాయి. ఏ రాజ‌కీయ పార్టీకైనా అధికారం శాశ్వితం కాదు.. ఆ విష‌యం నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. బాబు మాత్రం శాశ్వితంగా టీడీపీ పార్టీ ప‌వ‌ర్‌లో ఉంటుందంటూ బ‌డాయి క‌బుర్లు చెబుతుంటారు. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ నేత‌లు మాత్రం రానున్న పదేళ్లు త‌మకు తిరుగులేద‌ని మాత్రం చెప్పేవారు. తాజాగా మాత్రం హ‌రీశ్‌.. రానున్న ఇర‌వై ఏళ్లు త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా చెబుతున్న తీరు చూస్తే.. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపించ‌ట్లేదు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు