ఆ తెలుగు ప్ర‌ముఖుడికి సోనియా మ‌ద్ద‌తు?

ఆ తెలుగు ప్ర‌ముఖుడికి సోనియా మ‌ద్ద‌తు?

జాతీయ రాజ‌కీయాల్లో మ‌రోమారు కాంగ్రెస్‌-క‌మ్యూనిస్టులు ఏకం అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాజ్య‌స‌భ ఎన్నిక‌లు దీనికి బీజం వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు ప్ర‌ముఖుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మ‌రోమారు రాజ్యసభకు ఎంపిక కావడానికి కాంగ్రెస్‌ పార్టీ తన సహకారాన్ని అందించాలని భావిస్తున్నట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాందీ, పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ రంగంలోకి ఈ మేర‌కు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న అనంత‌రం ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన సీపీఎంకు పశ్చిమ బెంగాల్‌ శాసనసభలో ప్ర‌స్తుతం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరిని బ‌రిలో దింపాల‌ని చూస్తోంది. అయితే ఓట్ల రీత్యా రాజ్యసభకు ఎంపిక కావడం కష్టం. మ‌రోవైపు కాంగ్రెస్‌ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా సీతారాం ఏచూరికి మద్దతు ఇస్తే ఆయన రాజ్యసభకు సునాయాసంగా ఎంపిక అవుతారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌న మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షాలను స‌మ‌న్వ‌యం చేయ‌గలిగే వ్యక్తిగా సీతారం ఏచూరి గుర్తింపు పొందారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ ఏకమవ్వాల్సిన తరుణలో పార్లమెంటులో ఏచూరి ఉండటం అవసరమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే మ‌రోద‌ఫా ఏచూరి ఎంపిక అయ్యేందుకు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు