సొంత జిల్లాలోనే లోకేష్‌కు షాక్‌

సొంత జిల్లాలోనే లోకేష్‌కు షాక్‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మునగాల పాలెం వెళ్లిన లోకేష్‌కు ఘాటు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. 'మీ వెనుక ఉన్న వారి వళ్లే ఇదంతా జరిగింది' అంటూ గ్రామస్తులు లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఉంటున్న‌ అమరావతికే కాదు మా గ్రామాలకు కూడా రోడ్లు కావాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు చేస్తున్న ఇసుక దందాపై ఫిర్యాదు చేయడానికి గ్రామస్తులు ఏర్పేడు వెళ్లారని బాధితులు చెప్పారు.

కాగా, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మునగాల పాలెంలో పరాభవం ఎదురైంది. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మునగాల పల్లి వెళ్లిన బొజ్జలను ఒక మహిళ నిలదీసింది. ఏర్పేడు ప్రమాదంలో తన భర్తను కోల్పోయిన ఆ మహిళ ``న‌ష్ట‌ప‌రిహారం కింద మీరు ఐదు లక్షలు ఇవ్వడం కాదు, నేను పది లక్షలు ఇస్తా నా భర్తను బతికించి తీసుకురాగలరా?` అని ప్రశ్నించింది. ఇసుక దందా గురించి మీకు తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రిని స‌ద‌రు మ‌హిళ నిలదీసింది. మీరు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ప్రశ్నించింది. మాకు జరగాల్సిన నష్టం ఎటూ జరిగిపోయింది. మిగిలిన వాళ్లైనా బాగుండేలా చర్యలు తీసుకోండని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

కాగా, ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులు లోకేష్, నారాయణ, అమర్ నాథ్ రెడ్డిలు మృతుల నివాసాలకు వెళ్లి వారిని ఓదార్చారు. అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ మునగాల పల్లిలో ఇసుక దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేసినట్లు చెప్పారు. అలాగే మృతులు తెలుగుదేశం కార్యకర్తలు కనుక పార్టీ నుంచి రెండు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు.

తాను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. ఈ సంఘటనకు వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మ‌రోవైపు ఏర్పేడు రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరు మరణించారు. నిన్న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్విమ్స్ లో చికిత్స పొంందుతున్న జర్నలిస్టు  ఈ రోజు మరణించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు