రాష్ట్రప‌తిగా మ‌ళ్లీ ప్ర‌ణ‌బ్?

రాష్ట్రప‌తిగా మ‌ళ్లీ ప్ర‌ణ‌బ్?

రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం ఈ ఏడాది జూలై 24న ముగుస్తుంది. మ‌రోవైపు కొత్త‌ ప్రెసిడెంట్ కోసం వేట మొద‌లైంది. బీజేపీ కూట‌మి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కోసం తీవ్రంగా గాలింపు మొద‌లు పెట్టింది. ప్ర‌ణ‌బ్ స్థానంలో ఎవ‌ర్నీ పెట్టాల‌ని మోడీ నేతృత్వంలోని బీజేపీ త‌న కూట‌మి పార్టీల‌తో మంత‌నాల్లో తేలింది. అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కూడా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం అభ్య‌ర్థిని పోటీలోకి దించాల‌ని ఆలోచిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ మిత్ర‌ప‌క్ష పార్టీలైన జ‌న‌తాద‌ళ్ యునైటెడ్‌, లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీపై పోటీకి అభ్య‌ర్థిని దించాల‌ని వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో జేడీ, లెఫ్ట్ పార్టీ నేత‌లు స‌మావేశాలు కూడా జ‌రిపారు. ఇటీవ‌ల బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌, లెఫ్ట్ పార్టీ నేత సీతారం ఏచూరిలు కొత్త ప్రెసిడెంట్ అంశాన్ని సోనియాతో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

ఒక‌వైపు బీజేపీ పార్టీ దేశ‌వ్యాప్తంగా దూసుకెళ్లుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌లం విక‌సించిన‌ తీరు కాంగ్రెస్‌తో పాటు దాని మిత్ర‌ప‌క్షాల్లోనూ ద‌డ పుట్టించింది. దీంతో ప్రెసిడెంట్ ప‌ద‌విని ఆయా పార్టీలు కీల‌కంగా భావిస్తున్నాయి. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు స‌మ‌ర్థ‌మైన వ్య‌క్తి కావాల‌ని, ప్రెసిడెంట్ పోస్ట్‌లో అలాంటి వ్య‌క్తినే నియ‌మించాల‌ని భావిస్తున్నాయి. దీనిలో భాగంగానే సోనియా గాంధీతో ముఖ్య నేత‌లు భేటీ అయ్యారు. ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూడా సోనియాతో ఈ అంశాన్ని చ‌ర్చించేందుకు ఉవ్విళ్లుఊరుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు కాంగ్రెస్ పొత్తు పార్టీలు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీనే రెండ‌వ సారి ప్రెసిడెంట్ ప‌ద‌వికి రంగంలోకి దించాల‌ని భావిస్తున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మోడీ అంగీక‌రిస్తేనే, ఈ ఎత్తు ఫ‌లించే అవ‌కాశం ఉంది.

బీజేపీని ఢీకొట్టేందుకు మ‌హాకూట‌మిగా ఆవిర్భ‌వించాల‌ని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ గ‌తంలో అభిప్రాయ‌ప‌డ్డారు. కాంగ్రెస్‌, జేడీ, ఆర్జేడీ, బీఎస్పీ పార్టీల‌ క‌ల‌యిక‌తో మ‌హా కూట‌మిని ఏర్పాటు చేసి, బీజేపీ మిత్ర ప‌క్షాల‌కు దీటైన జ‌వాబు ఇవ్వాల‌ని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ భావిస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం కావాల్సిన ఓట్ల‌లో బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌కు కేవ‌లం 48 శాతం ఓట్లు మాత్ర‌మే ఉన్నాయి. టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే లాంటి పార్టీల‌తో జ‌త‌క‌డితే బీజేపీ హాఫ్ మార్క్‌ను దాటే అవ‌కాశాలున్నాయి. అయితే ఈ సంద‌ర్భాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు అదునుగా మార్చుకోవాల‌నుకుంటున్నాయి. ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం అభ్య‌ర్థిని పోటీలోకి దించాల‌ని భావిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు