కాంగ్రెస్ సీనియ‌ర్లు పెద్ద‌ల ముందే త‌న్నుకున్నారు

కాంగ్రెస్ సీనియ‌ర్లు పెద్ద‌ల ముందే త‌న్నుకున్నారు

కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. కొంతకాలంగా నోటికే పనిచెప్పిన కాంగ్రెస్ నేతలు ఏకంగా తన్నుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఎదుటే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏఐసీసీ నేత, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కొట్టుకోవడం పార్టీ నేతలకు విస్మయం కలిగించింది. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌లో ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పార్టీ సమీక్షా సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీనేత కే జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఉమ్మడి నల్లగొండ సమీక్షా సమావేశం మొదటి నుంచే వేడివేడిగా జరిగింది. తాను గతంలో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించినందున యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ, డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపిక బాధ్యతను తనకు వదిలేయాలని, తాను సూచించిన నేతలనే పదవుల్లో నియమించాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఆలేరుకు చెందిన బూడిద భిక్షమయ్యగౌడ్ ఎంపిక దాదాపు ఖరారైందని, ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి పార్ల మెంట్ నియోజకవర్గపరిధిలోకి వచ్చే భువనగిరి, మునుగోడులో తాను సూచించిన వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి కోరారు. ఈ దశలో కోమటిరెడ్డి పక్కనే కూర్చొని ఉన్న భువనగిరికి చెందిన ఏఐసీసీ నేత, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కలుగజేసుకున్నారు. ``భువనగిరి టికెట్ రాజగోపాల్‌రెడ్డి సూచించిన వారికి ఎలా ఇస్తారు? ఆయన స్థానికేతరుడు. 20 ఏళ్లుగా భువనగిరిలో పార్టీ కోసం మేం పనిచేస్తున్నాం. స్థానికులమైన మా అభిప్రాయం తీసుకోకుండా స్థానికేతరుల అభిప్రాయాలతో అభ్యర్థుల ఎంపికను ఒప్పుకోబోం. ఆయన ఒక కాంట్రాక్టర్.. ఒక్కసారి ఎంపీగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి సూచించిన వారికే టికెట్ ఇవ్వడం సరికాదు. మేం సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి`` అని దిగ్విజయ్, ఉత్తమ్‌కు గూడూరు నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.

దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహానికి గురై నారాయణరెడ్డి చెంప పగులగొట్టారు. వెనువెంటనే మరోసారి చెయ్యిచేసుకున్నారు. గూడూరు నారాయణరెడ్డి సైతం తిరగబడి రాజగోపాల్‌రెడ్డిపై చెయ్యి చేసుకున్నారు. ఇద్దరూ కొట్టుకుంటుండడంతో దిగ్విజయ్ సింగ్‌-జానారెడ్డి- ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పార్టీ నేతలంతా బిత్తరపోయారు. జానారెడ్డి లేచి నిలబడి కొట్టుకోవద్దని వారించినా ఫలితం లేకపోయింది. చివరకు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, మరికొందరు ఇద్దరిని విడదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పక్కకు తీసుకెళ్లినప్పటికీ, గూడూరు నారాయణరెడ్డిని దుర్భాషలాడారని స‌మాచారం.

కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తమ్-జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేతల ఎదుటే చెయ్యి చేసుకోవడం ఏమిటని, ఏదైనా పార్టీలైన్‌లో ఉండి వ్యవహరించాలి, చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తించడం సరికాదని తలంటారు. ఇది క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని దిగ్విజయ్‌సింగ్ హెచ్చరించారు. మరో వైపు రంగారెడ్డి జిల్లా సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మధ్య కూడా విభేదాలు భగ్గుమన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తన ఓటమికి మల్‌రెడ్డి రంగారెడ్డి కారణమని మల్లేష్ ఫిర్యాదు చేశారు. అగ్రనేతల ఎదుటే కొట్టుకోవడం కాంగ్రెస్ నేతల సంస్కృతికి నిదర్శనంగా నిలిచిందని సమావేశం తర్వాత పలువురు నేతలు చర్చించుకోవడం వినిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు