ఎన్నిక‌లు ఎప్పుడొస్తాయో చెప్పేసిన బాబు

ఎన్నిక‌లు ఎప్పుడొస్తాయో చెప్పేసిన  బాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. పార్టీ శ్రేణుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోణంలో ఉద్బోధ చేస్తున్న బాబు తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై జోస్యం చెప్పారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఈసారి గడువుకు ముందే రావొచ్చని టీడీపీ శ్రేణులకు చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీగా సిద్దం కావాల‌ని కూడా ఆయ‌న సూచించారు. అమరావతిలో పార్టీ అధినేత‌ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇన్ చార్జి మంత్రుల నియామకం, మహానాడు వేదిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు తమ వాహనంపై నీలి బుగ్గ తీసివేసి హాజరయ్యారు.

టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ... 2018 చివర్లో ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఈ దిశ‌గా తాజాగా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ‌ని బాబు విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో ఆయా పార్టీల పరిస్థితిపై జరిపిన సర్వే వివరాలను కూడా చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు వివరించారు. గ‌త ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీకి 16.13 ఓట్లశాతం పెరిగిందని, అలాగే వైసీపీ ఓట్ల శాతం 13.45 మేర తగ్గిందని వివరించారు. ఇక కాంగ్రెస్ ఓట్ల శాతం ఒక్క శాతానికే పరిమితమైందని చంద్రబాబు వివరించారు. అలాగే 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో వార్డు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని చంద్రబాబునాయుడు టీడీపీ శ్రేణులకు వివరించారు.

మ‌రోవైపు కొందరు టీడీపీ నేతల బాధ్యతారాహిత్యంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అలాగే తాము బాగుపడితే చాలన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విజయనగరంలో సుజయకృష్ణ రంగారావు సమావేశం పెడితే ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారని, ఇది ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు. అలాగే అద్దంకి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రవికుమారే ఇన్‌ఛార్జిగా కొనసాగుతారని, కానీ… పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పార్టీ నేత‌లు అంతా స‌మ‌న్వ‌యం చేస్తార‌ని పేర్కొన్నారు. పార్టీ నేత‌లు త‌మ మ‌ధ్య ఉన్న స‌మ‌స్యల‌ను పెద్ద‌గ చేసుకొని పార్టీకి న‌ష్టం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు