ట్రంప్‌లో ఈ క‌ళ‌లు కూడా ఉన్నాయి మ‌రి

ట్రంప్‌లో ఈ క‌ళ‌లు కూడా ఉన్నాయి మ‌రి

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఒకింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయ‌మే దాదాపు మెజార్టీ వ‌ర్గాల్లో ఉంది. కానీ ఆయ‌న‌లో ఓ విలాస పురుషుడు కూడా ఉన్నాడు. వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్ అట్ట‌హాస‌మైన జీవ‌న శైలికే ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు అధ్య‌క్షుడి హోదాలో కూడా ఆయ‌న అదే తీరును పాటించేందుకు ముందుకు సాగుతున్నాడు.

అక్టోబర్ నెల రెండో వారంలో బ్రిటన్‌లో పర్యటించనున్నట్రంప్‌ ఒకింత భిన్నమైన కోరికను బయటపెట్టాడు. అదేంటంటే...బ్రిట‌న్ రాణి ఎలిజబెత్‌తో మర్యాదపూర్వక భేటీ కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు తన బుల్లెట్ ప్రూఫ్ కారును పక్కన పెట్టి బంగారం మెరుగులు అద్దిన రాణిగారి రథంలో ప్రయాణం చేస్తానని చెప్ప‌డం.

త‌న ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బ్రిట‌న్ రాణి ర‌థం సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని బ్రిటన్ భద్రతా సిబ్బందికి ట్రంప్‌ సూచించారు. అధ్య‌క్షుడి కోరిక‌కు మ‌ద్ద‌తుగా వైట్‌హౌస్ సిబ్బంది కూడా ఒత్తిడి తెస్తున్నట్టు 'ది సండే టైమ్స్' పేర్కొంది. అయితే... ట్రంప్ బ్రిటన్ వస్తే పది వేల మందికిపైగా జనం ఆందోళన చేపట్టే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించలేమని అధికారులు తెలిపారు. ఆ రథం కంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళితేనే మంచిదని బ్రిటన్ అధికారులు బదులిస్తున్నారు. భారీ రాకెట్లు, పేలుడు పదార్థాలను తట్టుకునే సామార్థం రథానికి లేదని వివరించారట. రథానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఏర్పాటుచేయచ్చు కానీ అవి ఎక్కడైనా పడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పినట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా..2011లో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బ్రిటన్‌లో పర్యటించినప్పుడు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లారు. చైనా, రష్యా అధ్యక్షుడు ఎలిజబెత్ రాణి కలవడానికి ప్రత్యేక గుర్రపు భగ్గీలలో ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్ర‌స్తుతం భ‌ద్ర‌త కోణంలో ట్రంప్ ప‌ర్య‌ట‌న‌పై ఆ దేశ అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు