బాహుబలి-2కు టికెట్ల రేట్లు పెంపు?

బాహుబలి-2కు టికెట్ల రేట్లు పెంపు?

ఇంకో వారం మాత్రమే మిగిలుంది 'బాహుబలి: ది కంక్లూజన్' విడుదలకు. ఈ సినిమాపై హైప్ ఏ స్థాయిలో ఉందో.. ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'బాహుబలి-2' టికెట్ల కోసం డిమాండ్ కూడా ఊహించని స్థాయిలో ఉండబోతోంది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమానూ చూడనంతమంది ఈ చిత్రాన్ని చూస్తారని అంచనా వేస్తున్నారు.

బాహుబలి-2 టికెట్ కోసం నిర్ణీత ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారికంగానే బాహుబలి-2 టికెట్ల రేట్లను పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారట బాహుబలి నిర్మాతలు.

ఎన్నో కష్టాలకు ఓర్చి.. భారీ ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించామని.. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తేవడంతో పాటు తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచిన సినిమా ఇదని.. ఇలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. దీనిపై ప్రేక్షకుల్లోనూ అంత వ్యతిరేకత ఉండదని ప్రభుత్వానికి విన్నవించుకుని టికెట్ల రేట్ల పెంపు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు 'బాహుబలి' నిర్మాతలు.

మరోవైపు తొలి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారట ప్రొడ్యూసర్లు. ఈ రెండు ప్రతిపాదనలూ ఓకే అయితే.. బాహుబలి టీం పంట పండినట్లే. కలెక్షన్ల మోత మోగిపోవడం.. ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని ఫిగర్స్ నమోదవడం గ్యారెంటీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు