అమెరికాకు బొమ్మ చూపించిన ఉ.కొరియా

అమెరికాకు బొమ్మ చూపించిన ఉ.కొరియా

అమెరికా, ఉత్తర కొరియాల తీరు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షోను తలపిస్తోంది. నిత్యం ఒకరినొకరు తరుముకుంటూ ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. రెండు దేశాల అధ్యక్షులూ దుందుడుకు స్వభావం ఉన్నవారే కావడంతో ఎప్పుడేం చేస్తారో అని మిగతా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచానికే ప్రమాదం అని భావిస్తున్నారు.

పైగా... ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలు ఉండడం.. అమెరికా, తమ జోలికి వస్తే వాటిని ప్రయోగిస్తామని ఉ.కొరియా చెబుతుండడంతో అంతా టెన్షన్ పడుతున్నారు. ఉత్తర కొరియాలో అణ్వాయుధాలు ఉండడం పిచ్చోడి చేతిలో రాయి వంటివేనని.. ఎప్పుడు విసిరేస్తాడో తెలియదని అంటున్నారు. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతున్న సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు అమెరికాను బెదిరించేందుకు ఏకంగా గ్రాఫికల్ వీడియో రిలీజ్ చేశారు.
   
అమెరికాపై ఉత్తరకొరియా అణుబాంబు వేస్తే ఎలా ఉంటుందన్నది  గ్రాఫిక్స్‌తో రూపొందించిన వీడియోలో కళ్లకు కట్టినట్టు చూపించింది ఉత్తరకొరియా. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ 2 సంగ్ గౌరవార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వీడియోను ప్రదర్శించారు. ఉత్తరకొరియా వరుసపెట్టి సంధించిన క్షిపణలు దెబ్బకు అమెరికాలోని పలు నగరాలు మంటల్లో చిక్కుకున్నట్టు ఆ వీడియోలో చూపించారు. చివరికి కాలిపోతున్న అమెరికా జెండాతో ఆ వీడియో ముగుస్తుంది.
  
కాగా ఉత్తర కొరియాలో ఈ వీడియోను చూసిన వారు ఆనందంతో కరతాళ ధ్వనులు చేసినట్టు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.  కాగా, ఇటువంటి వీడియోలను విడుదల చేయడం ఉత్తరకొరియాకు ఇదేం తొలిసారి కాదు. 2013, 2016లోనూ ఇటువంటి వీడియోలనే ప్రదర్శించింది. ఈ విషయం తెలిసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రగిలిపోతున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు