ఇంత జ‌రిగినా ప‌న్నీర్ కోరిక నెర‌వేర‌ద‌ట‌

ఇంత జ‌రిగినా ప‌న్నీర్ కోరిక నెర‌వేర‌ద‌ట‌

త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ రాజ‌కీయాల్లో ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతోంది. రెండు గ్రూపులు ఏక‌మై దివంగ‌త ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత పార్టీ చీలిపోకుండా నిలుపుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చి మ‌న్నార్ గుడి మాఫియాగా పేరున్న శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్ స‌హా ఇత‌రుల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించిన సంగ‌తి తెలిసిందే. అయితే చీలిక వ‌ర్గాల నేత‌లైన మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం, ప్ర‌స్తుత సీఎం ప‌ళ‌నిస్వామి మ‌ధ్య కీల‌క అంశం విష‌యంలో ఉత్కంఠ కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. అ ముఖ్య‌మైన అంశం ఏమంటే...సీఎం పీఠం. ఈ కుర్చీని త‌మ నాయ‌కుడికే ఇవ్వాల‌ని సెల్వం వ‌ర్గం ప‌ట్టుప‌డుతుండ‌గా ప‌ళ‌ని వ‌ర్గం మాత్రం నో చెప్తోంది. లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురై ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

చీలిక‌ల వ‌ల్ల అన్నాడీఎంకే పార్టీ న‌ష్ట‌పోవ‌ద్ద‌నే ఉద్దేశంతోనే తాము ఏక‌తాటిపైకి వ‌చ్చిన‌ట్లు తంబిదురై తెలిపారు. అయితే ప‌ళ‌నిస్వామి దింపి ప‌న్నీర్ సెల్వంను సీఎం చేసే చాన్స్ లేద‌ని తెలిపారు. ప‌ళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదనను తంబిదురై తోసిపుచ్చారు. రెండు గ్రూపుల విలీనం నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ఆయన కొట్టిపారేశారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కాకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పన్నీర్ కు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే పన్నీర్ వర్గీయులు మాత్రం ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండ‌గా తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌న్నీర్ సెల్వం త‌న వ‌ర్గం నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నారు. ఈ స‌మావేశంలో విలీనం, భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విలీనం స‌మ‌యంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలు, దానిపై వ్య‌క్త‌మ‌యిన అభిప్రాయాల‌ను చ‌ర్చించ‌నున్నారు. ఒక‌వేళ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి స్వీకరించాలా వ‌ద్ద అనే విష‌యాన్ని త‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన అనంత‌రం సెల్వం ఖ‌రారు చేయ‌నున్నట్లు చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు