త‌మిళ‌ పాలిటిక్స్‌పై వెంక‌య్య మాట విన్నారా?

త‌మిళ‌ పాలిటిక్స్‌పై వెంక‌య్య మాట విన్నారా?

త‌మిళ‌నాట రాజ‌కీయం స‌రికొత్త మ‌లుపు తీసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత బ‌తికున్నంత కాలం సాఫీగానే జ‌రిగిన ఆ రాష్ట్ర రాజ‌కీయాలు... ఆమె మ‌ర‌ణం త‌ర్వాత ఒక్క‌సారిగా మారిపోయాయి. అన్నాడీఎంకేలో చీలిక వ‌చ్చేసింది. అమ్మ న‌మ్మిన బంటు ప‌న్నీర్ సెల్వంను కుర్చీ మీద నుంచి లాగేసిన జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌... తొలుత తాను ఆ పీఠాన్ని అధిష్టించాల‌ని చేసిన య‌త్నాలు బెడిసికొట్ట‌డంతో త‌న‌కు న‌మ్మిన బంటుగా ఉన్నాడ‌ని భావించిన ప‌ళ‌నిసామిని పీఠం ఎక్కించారు.

ఆ త‌ర్వాత ఆమె జైలుకు వెళ్ల‌గా... ఇప్పుడు ఆమె న‌మ్మిన బంటుగా ముద్ర ప‌డ్డ ప‌ళ‌నిసామే... ఆమెతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. ఈ క్ర‌మంలో నిన్న‌టిదాకా శ‌త్రువులుగా మెల‌గిన ప‌న్నీర్‌, ప‌ళ‌నిలు ఇప్పుడు మిత్రులుగా మారిపోయారు. పార్టీ, ప్ర‌భుత్వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఇద్ద‌రూ కూర్చుని చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ న‌డుపుతోంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స్వ‌యంగా ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక దృష్టి సారించ‌డ‌మే కాకుండా.... చిన్న‌మ్మ‌ను బ‌య‌ట‌కు గెంటేసి... ప‌న్నీర్‌, ప‌ళనిలు ఒక్క‌దారిలోకి వ‌చ్చేలా చేయ‌డంలో షా స‌క్సెస్ అయ్యార‌ని అన్ని మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌తో త‌మ పార్టీకి ఏమాత్రం సంబంధం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ని, వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం త‌మ‌కు ఎంత‌మాత్రం లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు. అంత‌టితో వెంక‌య్య ఆగితే బాగానే ఉండేది... అయితే అందుకు విరుద్ధంగా త‌మిళ‌నాడులో సుస్థిర ప్ర‌భుత్వం ఉంటేనే ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచిద‌ని కూడా ఆయ‌న ఉచిత స‌ల‌హా ప‌డేశారు.

అయినా బీజేపీ నేత‌లే తెర వెనుక ఉండి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నార‌ని, త‌మిళ నాట ఇప్ప‌టిదాకా త‌న‌కు అడుగు పెట్టేందుకు కూడా లేని వాతావ‌ర‌ణాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్నార‌ని వదంతులు వినిపిస్తున్న వేళ... వెంక‌య్య నోట ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న రావ‌డం ఏమిట‌ని, అయినా వెంక‌య్య చేసిన ఈ వ్యాఖ్యలు వాస్త‌వ విరుద్ధంగా ఉన్నాయ‌న్న వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English