బాలయ్యకు హిందూపురం సేఫ్ జోన్ కాదా?

బాలయ్యకు హిందూపురం సేఫ్ జోన్ కాదా?

ప్రతిపక్ష నేత నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో కుంపటి మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి హిందూపురంలో బాలయ్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు వినిపిస్తోంది. తరచూ ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, నిలదీయడాలు.. నేతల భేటీలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బాలయ్య హిందూపురంలో పోటీ చేస్తే గెలుపు కష్టమే అన్న వాదన మొదలైంది. తాజాగా బాలయ్యకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు తీసిన ర్యాలీకి  ప్రజల నుంచి భారీ మద్దతు లభించడంతో అందరి కళ్లూ హిందూపురం వైపు చూస్తున్నాయి.
   
నియోజకవర్గ సమస్యలు తీర్చాలంటూ వైకాపా ఆధ్వర్యంలో హిందూపురంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని, రహదారులకు మరమ్మతులు చేయాలని, ఆగిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, దున్నపోతులపై నినాదాలు రాసి, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ, ఈ ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
   
ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గనడంతో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆపై నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ, వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. మొత్తానికి బాలయ్య నియోజకవర్గంలో నిత్యం  సొంత పార్టీ నుంచో.. ప్రతిపక్షం నుంచో నిరసనలు వస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు