టైం చూసి... మోదీకి దెబ్బేశారుగా!

టైం చూసి... మోదీకి దెబ్బేశారుగా!

రాజ‌కీయాలంటే... ఆవేశం వ‌చ్చీ రాగానే విరుచుకుప‌డ‌టం కాద‌ట‌. స‌మ‌యం చూసి... సంద‌ర్భం చూసి విరుచుకుప‌డాల‌ట‌. ఇదేదో వ‌చ్చీ రానీ రాజ‌కీయం చేస్తున్న నేత‌లు చెబుతున్న మాట కాదు. రౌడీల రాజ్యంగా పేరుప‌డ్డ బీహార్‌ను సుదీర్ఘ కాలం పాటు పాలించి. తాను కేసులో చిక్కుకున్నా... జైల్లో కూర్చోనే భార్య చేత పాల‌న సాగించిన పొలిటికల్ యోధుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చెబుతున్న మాట‌. దాణా కుంభ‌కోణంలో దోషిగా తేలిన నేప‌థ్యంలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ను నుంచి త‌ప్పుకోని ప‌రిస్థితుల్లో అస్త్ర స‌న్యాసం చేసిన వాడ‌ల్లె... మ‌రోమారు జూలు విదిల్చి త‌న ఇద్ద‌రు కుమారుల‌ను బ‌రిలోకి దింపారు. లాలూ కుమారులిద్ద‌రిలో ఒక‌రు బీహార్ డిప్యూటీ సీఎంగా ఉండ‌గా, మ‌రొక‌రు నితీశ్ కుమార్ కేబినెట్‌లో కీల‌క మంత్రిగా ఉన్నారు.

ఇటీవ‌లి కాలంలో కొడుకుల శాఖ‌ల్లో వేలు పెడుతున్న లాలూ ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు కొని తెచ్చుకున్నారు. ఈ వైనంపై విప‌క్షాలు ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డాయి. బీజేపీ నేత‌లు సైతం లాలూ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. అయితే రాజకీయాల్లో కాక‌లు తీరిన యోధుడిగా పేరున్న లాలూ... ఆ విమ‌ర్శ‌ల‌న్నింటినీ చాలా ఓపిగ్గానే భ‌రించారు. అవ‌కాశం కోసం ఎదురు చూడ‌సాగారు. ఈ లోగా ఆ అవ‌కాశం రానే వ‌చ్చింది. నేటి ఉద‌యం బాబ్రీ మ‌సీదు విధ్వంసం కేసును విచారించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. 25 ఏళ్ల నాటి ఈ కేసును మ‌రింత కాలం పాటు కొన‌సాగించ‌డానికి వీలు లేద‌ని, ఈ క్ర‌మంలో ఈ కేసుపై ప్ర‌తి రోజు విచార‌ణ సాగేలా చూస్తామంటూ త‌న నిర్ణ‌యాన్ని స్ప‌ష్టీక‌రించింది. అంతేకాకుండా నాడు మ‌సీదు విధ్వంసానికి పాల్ప‌డిన క‌రసేవ‌కుల‌కు వెన్నుద‌న్నుగా నిల‌వ‌డ‌మే కాకుండా మ‌సీదు కూల్చివేత‌కు ప‌క్కా ప్లాన్ ర‌చించిన‌ట్లుగా భావిస్తున్న బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ, ఆయ‌న స‌మ‌కాలీకుడు ముర‌ళీ మ‌నోహ‌న్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భార‌తి స‌హా 12 మందిపై అభియోగాలు న‌మోదు చేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం వ్యాఖ్య‌లు విన్న వెంట‌నే రంగంలోకి దిగిన లాలూ... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ పడకుండా అద్వానీపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేశారని లాలూ ఆరోపించారు. ఇందులో భాగంగానే బాబ్రీ మసీదు కేసును తిరగదోడారని అన్నారు. ‘సీబీఐ.. ప్రధాని చెప్పుచేతుల్లో ఉంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో అద్వానీకి వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించింది. ఈసారి అద్వానీ రాష్ట్రపతి అవుతారని ప్రచారం జరుగుతోంది. అద్వానీ అవకాశాలకు ప్రధాని మోదీ గండికొట్టారు. రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేసిందని ఎవరైనా అర్థం చేసుకోగలరు’ అని లాలూ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. 2002 గుజరాత్‌ అలర్ల సమయంలో తనను అద్వానీ కాపాడారన్న క‌నీస‌ విశ్వాసం కూడా మోదీకి లేదని లాలూ ఆక్షేపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు