షాక్ః విదేశీ ఉద్యోగుల‌కు వీసాలు ఇవ్వ‌నంటున్న ఆస్ట్రేలియా

షాక్ః విదేశీ ఉద్యోగుల‌కు వీసాలు ఇవ్వ‌నంటున్న ఆస్ట్రేలియా

అగ్ర‌రాజ్యాధిప‌తి ట్రంప్ దెబ్బతో అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు, టెక్కీలు బెంబేలెత్తుతుంటే.. సరిగ్గా అదే తరహా నిర్ణయాన్ని అస్ట్రేలియా  ప్రకటించింది. ఆస్ట్రేలియా ఉద్యోగాలు మొదట ఆస్ట్రేలియన్లకే దక్కాలన్న లక్ష్యంతో వర్క్ వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ ప్రధాని మాల్కం టర్న్‌బుల్ సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాలో విదేశీయులు ఉద్యోగం చేసేందుకు 457 వీసా వీలు కల్పిస్తుంది. అయితే.. దానిని రద్దు చేసి, దాని స్థానంలో కఠినమైన కొత్త విధానాన్ని తీసుకురానున్నట్టు టర్న్‌బుల్ చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 457 వీసాపై దాదాపు 95వేల మంది విదేశీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో అత్యధికులు భారతీయులే కావ‌డం గ‌మ‌నార్హం.అమెరికా చర్యలతో అక్కడి ఎన్‌ఆర్‌ఐలు పెద్దఎత్తున నష్టపోతుండగా, తాజాగా ఆస్ట్రేలియా నిర్ణయం కూడా అక్కడి భారతీయులకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమించనుంద‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే క్రమంలో విదేశీయులు ఉపయోగించే వర్క్ వీసాలను రద్దు చేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. దీని స్థానంలో ఇంగ్లిష్‌భాషలో అధిక ప్రావీణ్యం, ఉద్యోగ నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త కార్యక్రమాన్ని తక్షణం తీసుకురానుంది. ఈ నిర్ణయంతో 95వేల మంది విదేశీ ఉద్యోగులు ప్రభావితం అవుతుంటే అందులో అత్యధికులు భారతీయులే! ఇటీవలే భారత్‌లో పర్యటించి, జాతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేకపోరు, విద్య, ఇంధన తదితర అనేక కీలక అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో అర్హులైన ఆస్ట్రేలియన్లు లేనిపక్షంలో వారి స్థానంలో విదేశీయులను నాలుగు ఏళ్ల పాటు వివిధ కంపెనీలు నియమించుకునేందుకు 457 వీసా వీలు కల్పిస్తుంది.  ఇప్పుడు దీనిని రద్దు చేయబోతున్నారు. వీటి రద్దు ప్రక్రియను 2018 మార్చి నాటికి పూర్తి చేయనున్నారు.

"మాది వలసల దేశం. కానీ, ఆస్ట్రేలియా ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకు ప్రాధాన్యం ఉండాలి. అందుకే విదేశీయులను మా దేశంలో నియమించుకునేందుకు ఉద్దేశించిన 457 వీసాను రద్దు చేయాలని నిర్ణయించాం" ప్ర‌ధాని అని టర్న్‌బుల్ చెప్పారు. "ఆస్ట్రేలియన్లకు వెళ్లాల్సిన ఉద్యోగాలకు ఇకపై 457 వీసాలను అనుమతించేది లేదు. అత్యధిక నిపుణత కలిగిన విదేశీయులను మాత్రమే తీసుకునేలా ఆస్ట్రేలియా ఫస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని మేం తీసుకోబోతున్నాం" అని ప్రధాని వివరించారు. నాలుగింట ఒక వంతు భారతీయులే ఈ వీసా కింద ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు పొందుతుంటారు. తర్వాతి స్థానాల్లో బ్రిటన్ (19.5%), చైనా (5.8%) ఉన్నాయని ఏబీసీ వార్తా సంస్థ పేర్కొంది.  గతేడాది సెప్టెంబర్ నెలాఖరు నాటి లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో 457 ప్రైమరీ వీసాల కింద 95,757 మంది పనిచేస్తున్నారు. మరో 76,430 మంది సెకండరీ వీసా హోల్డర్లు (ప్రైమరీ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులు) ఉన్నారని ఏబీసీ నివేదిక పేర్కొంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు