పవన్ కు సాక్షి ఎందుకు నచ్చిందంటే !

పవన్ కు సాక్షి ఎందుకు నచ్చిందంటే !

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ట్లుండి స్పందిస్తుంటారు. ఏదైనా జ‌రిగిన వెంట‌నే రియాక్ట్ కావ‌టం నిన్న‌టి మాట‌. త‌నకు తోచిన‌ప్పుడు కానీ.. ఘ‌ట‌న జ‌రిగిపోయిన రెండు మూడు రోజుల త‌ర్వాత కానీ స్పందించే చిత్ర‌మైన అల‌వాటు ప‌వ‌న్‌ది. రాజ్య‌స‌భ‌లో హోదా మీద చ‌ర్చ జ‌రిగిన వైనంపై రెండు రోజులు ఆల‌స్యంగా రియాక్ట్ కావ‌టం.. ద‌క్షిణాది వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ మాజీ ఎంపీ త‌రుణ్ విజ‌య్ పై విరుచుకుప‌డ‌టం (అంత‌కు ముందు ఒక‌సారి రియాక్ట్ అయ్యారు. తాజాగా ప్ర‌త్యేక హోదా ఎపిసోడ్ పై వ్యాఖ్య‌లు చేస్తూ.. అత‌నిపై మ‌రోసారి విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించ‌టం) క‌నిపిస్తుంది.

ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. తాను చెప్పాల‌నుకున్న వాటిని చెప్పేస్తుంటారు. వివిధ అంశాల మీద మాట్లాడ‌టం త‌ప్ప‌ని అన‌లేం. కాకుంటే.. కాస్త తీరుబ‌డిగా తిట్టిన తీరే భిన్నంగా క‌నిపిస్తుంది. ఈసారి ట్వీట్ల వ‌ర్షంలో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. గ‌తంలో తాను విమ‌ర్శించిన వారంద‌రిని పొగిడేయ‌టం. ఆ లిస్టులో మొద‌ట‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌స్తుంది. ఈ పార్టీ మీద ప‌వ‌న్ ఏత‌రహా వ్యాఖ్య‌లు చేశారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జ‌గ‌న్ పార్టీ ఎంపీలు క‌మాండింగ్ జాబ్ చేశారంటూ పొగిడేశారు. అంతేనా.. సాక్షి పేప‌ర్ క‌టింగ్‌ను జ‌త చేశారు. ఈ వార్త మరే పేపర్లోనూ అంత క్లియర్గా లేకపోవడంతో సాక్షి క్లిప్పింగ్ జత చేశారట.

గ‌తంలో వామ‌ప‌క్ష నేత నారాయ‌ణ మీద విమ‌ర్శ‌లు చేశారు. ఆ మాట‌కు వ‌స్తే.. ప‌వ‌న్ ఏంమాట్లాడినా.. మిగిలిన వారి సంగ‌తి త‌ర్వాత‌.. సీపీఐ నారాయ‌ణ చాలా సీరియ‌స్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శిస్తూ అయితే మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌టం కానీ.. లేదంటే ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేసేవారు. తాజా ఎపిసోడ్‌లో మాత్రం.. తానీ మ‌ధ్య త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్న ఉత్త‌రాది.. దక్షిణాది మాట‌ల మాదిరే సీపీఐ నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల పేప‌ర్ క‌టింగ్‌ను జ‌త చేసి.. బీజేపీ మాజీ ఎంపీని దులిపేశారు.

ఇక‌.. టీఆర్ఎస్‌కు చెందిన కేకేను పొగిడేశారు. టీఆర్ఎస్ ను ప‌వ‌న్ ఎలా చూస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. ఆయ‌నీ ఎపిసోడ్‌లో పొగిడేశారు. అంతేనా.. కాంగ్రెసోళ్ల‌ను పంచెలూడ‌దీసి కొడ‌తా అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌.. అదే పార్టీకి చెందిన వారు హోదా మీద మాట్లాడిన వైనాన్ని ప్ర‌శంసిస్తూ పొగిడేశారు. ఇలా గ‌తంలో తాను ఎవ‌రినైతే విమ‌ర్శించారో వారంద‌రిని టోకుగా ఒకేసారి పొగిడే కార్య‌క్ర‌మాన్ని త‌న ట్వీట్ల‌తో పూర్తి చేసేశారు ప‌వ‌న్‌. అదే  స‌మ‌యంలో తాను మ‌ద్ద‌తు ఇచ్చిన బీజేపీని.. టీడీపీని విమర్శించేయ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు