ప‌దే ప‌దే కృష్ణ‌వంశీ తిట్టేవారు

ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌.. బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన న‌టుడు. అంత‌కంటే ముందే సినిమాల్లో ఓ మోస్త‌రు పాత్ర‌లు చేశాడు. అత‌డి కెరీర్లో అతి పెద్ద సినిమా అంటే.. గోవిందుడు అంద‌రి వాడేలే. రామ్ చ‌ర‌ణ్ లాంటి పెద్ద స్టార్ న‌టించిన సినిమాలో మెయిన్ విల‌న్ పాత్ర చేయ‌డమంటే పెద్ద ఛాన్స్ కాక మ‌రేంటి? ఐతే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో ఆద‌ర్శ్‌కు బ్రేక్ రాలేదు. అయిన‌ప్ప‌టికీ ఆ సినిమా త‌న‌కు న‌టుడిగా గొప్ప పాఠం అంటున్నాడు ఆద‌ర్శ్‌.

కృష్ణ‌వంశీ లాంటి ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డం.. ప్ర‌కాష్ రాజ్, రామ్ చ‌ర‌ణ్ లాంటి పెద్ద న‌టుల‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం గొప్ప అనుభం అన్నాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా త‌నను కృష్ణ‌వంశీ బాగా అవ‌మానించిన‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆద‌ర్శ్ చెప్పాడు.

కృష్ణ‌వంశీ సినిమాలో చేయ‌డ‌మంటే అదృష్టం, ఆయ‌న ఆర్టిస్టుల‌కు చాలా నేర్పిస్తార‌ని అంద‌రూ చెప్పార‌ని.. ఐతే ఆయ‌న న‌టుడిగా త‌న‌కున్న న‌మ్మ‌కాన్ని, ఆత్మ‌విశ్వాసాన్ని నాశ‌నం చేసేశాడ‌ని ఆద‌ర్శ్ అన్నాడు. షూటింగ్ సంద‌ర్భంగా నీకు న‌ట‌న రాదు, నువ్వెందుకూ ప‌నికి రావు అంటూ ప‌దే ప‌దే కృష్ణ‌వంశీ తిట్టేవాడ‌ని, అవ‌మాన‌కరంగా మాట్లాడేవాడ‌ని ఆద‌ర్శ్ చెప్పాడు.

ఐతే ఇందుకు త‌న‌కు కృష్ణ‌వంశీపై కోపం ఏమీ లేద‌ని, ఇదంతా త‌న నుంచి మంచి న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డం కోస‌మే అయ్యుండొచ్చ‌ని ఆద‌ర్శ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక ద‌శ‌లో విమ‌ర్శ‌లు ఎక్కువ కావ‌డంతో దాన్ని తాను పాజిటివ్‌గానే తీసుకున్నాన‌ని, ఇంత వ‌ర‌స్ట్ చూశాక జీవితంలో ఇంకేదీ క‌ష్టం కాదు అనే భావ‌న క‌లిగింద‌ని ఆద‌ర్శ్ చెప్పుకొచ్చాడు.

ఐతే సినిమా అయిపోయాక మాత్రం కృష్ణ‌వంశీతో మంచి స్నేహ‌మే కొన‌సాగుతోంద‌ని.. ఎప్పుడు క‌లిసినా బాగా మాట్లాడుకుంటామ‌ని.. త‌న‌ను ఒక‌ప్పుడు తిట్టిన విష‌యాలు గుర్తు చేసుకుని న‌వ్వుకుంటామ‌ని ఆద‌ర్శ్ చెప్పాడు.