మాస్కు లేదని అడిగితే.. భర్తను ముద్దు పెట్టుకుంటానంటూ రచ్చ

ఓపక్క కరోనా కేసులు పెరిగి జనాలు నానా కష్టాలు పడుతున్న వేళ.. ప్రభుత్వాలు పెట్టిన నిబంధనల్ని పాటించటం మానేసి.. రోడ్డు మీద రచ్చ చేస్తున్న వారి ఉదంతాలు ఇప్పుడో తలనొప్పిగా మారుతున్నాయి. ఇలాంటి ఉదంతాలు పోలీసులకు కొత్త తిప్పల్ని తెచ్చి పెడుతున్నాయి. గతంలో ఫోన్లకు కెమేరాలు లేకపోవటం.. ఒకవేళ ఉన్నా.. వాటిని వైరల్ చేయటానికి సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమకు అనుకూలంగా వీడియోల్ని మార్చుకొని రచ్చ చేసే వారికి కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఆచితూచి అన్నట్లు విధి నిర్వహణ చేయాల్సి వస్తోంది.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి పరిస్థితే నెలకొంది. కారులో వెళుతున్న వారైనా సరే.. ముఖానికి మాస్కు వేసుకోవాలంటూ నిబంధనను తీసుకొచ్చారు. ఇలాంటివేళ.. కొత్త కారులో వెళుతున్న జంట మాస్కులు లేకుండా ప్రయాణించటాన్ని గుర్తించిన పోలీసులు కారును నిలిపారు. అంతేకాదు.. కర్ఫ్యూ వేళలో అత్యవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నించగా.. రచ్చ రచ్చ చేశారు.

దరియా గంజ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సదరు జంట పోలీసులపై దురుసుగా వ్యవహరించటమేకాదు.. వారిని నానా మాటలు అనేయటం గమనార్హం. తనకు మాస్కు లేదని.. తన భర్తను ముద్దు పెట్టుకుంటానని.. తనను ఆపగలరా? అంటూ పోలీసుల్ని దబాయించిన తీరుతో.. వారు మిన్నకుండిపోయారు. మాస్కు ఎందుకు పెట్టుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. నోటికి పని చెప్పిన ఈ జంట రచ్చ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద చక్కర్లు కొడుతున్న జంట తీరును పలువురు తప్పు పడుతున్నారు. విపత్తు వేళ పోలీసులకు.. అధికారుల విధి నిర్వహణకు అడ్డు తగలకుండా ఉండాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరుపై పలువురు మండి పడుతున్నారు. ఈ జంట చేసిన ఓవర్ యాక్షన్ కు ప్రతిగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. రూల్స్ ను బ్రేక్ చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.