రోజా మాటలు విన్నావా రాజా

 రోజా మాటలు విన్నావా రాజా

క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ‌రామాల‌యం సాక్షిగా నేటి మ‌ధ్యాహ్నం చేసిన వ్యాఖ్య‌ల‌తో ప్ర‌ముఖ సినీ న‌టి, వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అడ్డంగా బుక్క‌య్యార‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తాను ఉంటున్న పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అభిన‌వ రాముడిగా అభివ‌ర్ణించిన రోజా... జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే... ఏపీలో మ‌ళ్లీ రామ‌రాజ్యం వ‌చ్చేసిన‌ట్టేన‌ని చెప్పారు. సొంత పార్టీ అధినేత‌ను ఆమాత్రం పొగ‌డ‌టంలో త‌ప్పు లేదు గానీ... ఇప్పుడు త‌మ‌కు వైరి వ‌ర్గంగా ఉన్న పార్టీలో గ‌తంలో తానున్నాన‌ని మ‌రిచిపోయిన రోజా... మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో రోజా టీడీపీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. నాడు విప‌క్షంలో ఉన్న నేప‌థ్యంలో అప్పుడు వైఎస్ పాల‌న‌పై రోజా త‌న‌దైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను సాగిస్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. అప్పుడ‌ప్పుడే సినీ జ‌గ‌త్తుకు వీడ్కోలు ప‌లికి... కొత్త‌గా రాజ‌కీయ రంగ‌ప్రవేశం చేసిన రోజా... ఎంత‌మేర రాణిస్తార‌న్న వాద‌న వినిపించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో వాగ్బాణాలు సంధించి రాజ‌కీయాల్లోనూ రోజా రాణిస్తార‌ని నిరూపించుకున్నారు. అంశ‌మేదైనా...త‌న‌దైన శైలిలో వాగ్ధాటి ప్ర‌ద‌ర్శించే రోజా... అతి త‌క్కువ కాలంలోనే సత్తా క‌లిగిన పొలిటీషియ‌న్‌గా నిరూపించుకున్నారు.

అయితే నాడు మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన రోజా... వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రోజా కాంగ్రెస్‌లో చేరిన కొన్నాళ్ల‌కే వైఎస్ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయారు. దీంతో నాడు రోజాను అంతా ఐర‌న్ లెగ్‌గా అభివ‌ర్ణించిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. ఇదంతా గ‌త‌మైతే... నేటి మ‌ధ్యాహ్నం రాములోరి కల్యాణానికి వ‌చ్చిన రోజా... స్వామి వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ... రానున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని, జ‌గ‌న్ సీఎంగా అధికార ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని, రాష్ట్రంలో రామ‌రాజ్యం మ‌ళ్లీ క‌నిపిస్తుంద‌ని చెప్పారు.

ప‌నిలో ప‌నిగా రాముడి త‌ర్వాత సుప‌రిపాల‌న‌ను అందించ‌న నేత ఎవ‌రైనా ఉన్నారంటే... అది ఒక్క వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి మాత్ర‌మేన‌ని కూడా రోజా చెప్పారు. మ‌రి నాడు వైఎస్ పాల‌న‌ను రాక్ష‌స పాల‌న‌గా అభివ‌ర్ణించిన రోజా నోట‌... నేడు అదే పాల‌న‌ రామ‌రాజ్యమంటూ విన‌ప‌డ్డ మాట జ‌నాన్ని అయోమ‌యానికే గురి చేసింద‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో రాముడి పాల‌న‌నున రాక్ష‌స పాల‌న‌గా చెప్పిన రాక్ష‌స యువ‌తి లంఖిణి, అదే స‌మ‌యంలో రాముడి పాద స్ప‌ర్శ‌తో మ‌నిషిగా మారిన అహ‌ల్య మాదిరిగా చెప్ప‌డం నిజంగానే విడ్డూరంగా అనిపించ‌క మాన‌దు. వైఎస్ పాల‌న‌ను నాడు రాక్ష‌స పాల‌న‌గా చెప్పిన రోజాను లంఖిణిగా భావించాలో... లేదంటే అదే వైఎస్ పాల‌న‌ను రామ‌రాజ్యంగా కీర్తిస్తున్న ఆమెను అహ‌ల్య‌గా భావించాలో తెలియ‌క జ‌నం డైల‌మాలో ప‌డిపోయారు. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు