గంటాను బొజ్జ‌ల ఫ్యామిలీ బూతులు తిట్ట‌లేద‌ట‌

గంటాను బొజ్జ‌ల ఫ్యామిలీ బూతులు తిట్ట‌లేద‌ట‌

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌కంప‌న‌లు ఏపీలో ఇంకా చ‌ల్లార‌లేదు. ప‌ద‌వులు ద‌క్క‌క అల‌క‌బూనిన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ వారు కొంద‌రైతే...మంత్రి ప‌ద‌వుల నుంచి ఊడి బీక‌డంతో అవ‌మానం పాలైన‌వారు మ‌రికొంద‌రు! ఇలా ప‌ద‌వి పోగొట్టుకున్న వారిలో తీవ్రంగా అసంతృప్తి చెందడంతో పాటు అదే రేంజ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది....టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి.

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో బొజ్జ‌ల‌కు స‌ర్దిచెప్పేందుకు టీడీపీ అధిష్టానం ఎంపీ సీఎం ర‌మేశ్, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావును దూత‌లుగా పంపింది. అయితే దీనిపైనే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అదేంటంటే... బొజ్జ‌ల ఇంటికి వెళ్లిన గంటా, సీఎం ర‌మేశ్‌ను బొజ్జ‌ల స‌తీమ‌ణి ఉతికి ఆరేసింద‌ట‌. సుదీర్ఘ అనుబంధం ఉన్న‌ప్ప‌టికీ బాబు త‌మ‌ను అవ‌మానించాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ట‌. ఈ క్ర‌మంలోనే మంత్రి గంటా జోక్యం చేసుకొని `పార్టీ మారే నిర్ణ‌యాలు ఏవీ తీసుకోవ‌ద్దు` అని సూచించ‌గా...ఎన్నో పార్టీలు మారిన నువ్వా మాకు చెప్పేది అని బొజ్జ‌ల స‌తీమ‌ణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌నే స‌మాచారం సోష‌ల్ మీడియాలో ఈ ఉద‌యం నుంచి వైరల్ అయింది. అయితే ఇదంతా ఉట్టిదేని, త‌ప్పుడు ప్ర‌చారమ‌ని బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు బొజ్జల సుధీర్ మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు.

ఆయ‌న మీడియాతో ఏమ‌న్నారంటే...``నిన్న ఎంపీ సీఎం రమేష్, మంత్రి గంటా శ్రీ‌నివాసరావు మా వ‌ద్ద‌కు వచ్చారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ప‌ద‌వి తొల‌గించారని తెలిపారు. అయితే ఆరోగ్య సమస్యలు అంటూ డీ గ్రేడ్ చేయడం సరికాదని చెప్పాం. ఆరోగ్య సమస్యలు సహజం. మానాన్న బాగా తిరుగుతున్నారు. అయినా ఇలాంటి కార‌ణం చెప్తున్నారు. మా కుటుంబానికి మంత్రి పదవులు కొత్త కాదు. ప్ర‌స్తుతం ప‌ద‌వి తొల‌గించినందుకు చంద్రబాబు పై కోపం లేదు. చేసిన పద్ధతి బాగాలేదని చెప్పాం. మూడేళ్లు మచ్చలేకుండా పని చేశారు. మా నాన్న  ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారు. అయినా టీడీపీలోనే ఉంటాం. ఏ పార్టీకి పోయే సమస్యే లేదు. పార్టీకి రాజీనామా చేసేది ఉంటే ఇప్పటికే చేసేవాళ్లం. రెబల్స్ అయి దండయాత్ర చేసే ఉద్దేశాలు లేవు. కార్యకర్తలతో భేటీ అవుతాం. తర్వాత ఏమిటన్నది నిర్ణయిస్తాం. సోషల్ మీడియాలో మేమేదో గంటా, రమేష్ లను నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారం చాలా బాధాకరం. దీనిపై పోలీసుల‌కు  ఫిర్యాదు చేశాం. శ్రీకాళహస్తి టీడీపీకి ఎప్పటికీ కంచుకోటే. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం శవరాజకీయం. మాకు మ‌ద్ద‌తుగా ఉన్నవారికి కృతజ్ఞతలు`` అని క్లారిటీ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు